కూటమికి పెరిగిపోతున్న కష్టాలు...!
మనసులు కలవని మనువుగా ఈ కూటమి ఉందని అంటున్నారు. కూటమికి పెద్దన్న ఎవరు అన్నది తెలియడం లేదు.
కూటమికి కష్టాలు అలా పెరిగిపోతున్నాయి. 2014 నాటి మ్యాజిక్ రిపీట్ అనుకుంటూ కూటమి కట్టారు కానీ 2024 నాటి పరిస్థితులు వేరుగా మారుతున్నాయి. ఆనాడు బీజేపీ పూర్తిగా సహకరించింది. జనసేన అయితే ఔట్ రైట్ గా బయట నుంచి మద్దతు ఇచ్చింది. దాంతో పొత్తు పేచీలు ఏవీ లేకుండా కధ సుఖాంతం అయింది. ఏపీ మీద నాడు బీజేపీ కేంద్ర నాయకులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వచ్చారు.
ప్రధాని అభ్యర్ధిగా ఉన్న నరేంద్ర మోడీ కూటమికి ఆక్సిజన్ గా నిలిచారు. ఇలా మిత్రుల పూర్తి సహకారంతో కూటమికి ఎన్నికల ముందే అధికారం కళ కొట్టొచ్చినట్లుగా కనిపించింది. కానీ ఈసారి మాత్రం అంతా ఉల్టా సీదా గా సాగుతోంది అని అంటున్నారు. కూటమి ఏర్పాటు ఆలస్యంగా సాగింది.
మనసులు కలవని మనువుగా ఈ కూటమి ఉందని అంటున్నారు. కూటమికి పెద్దన్న ఎవరు అన్నది తెలియడం లేదు. ఎవరికి వారు యమునా తీరేగా పరిస్థితి ఉంది. నాడు చంద్రబాబు పూర్తిగా కూటమికి సారధ్యం వహించారు. వ్యూహాలు అన్నీ ఆయనే చూసుకునేవారు.
అందరూ నాడు బాబు మాట వినేవారు. ఇపుడు సొంత పార్టీలో కూడా రెబెల్స్ తయారై చంద్రబాబుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇక మిత్రుల కధ సరేసరి. ఇచ్చిన సీట్లలో అసంతృప్తులు ఉన్నాయంటున్నారు. అదే సమయంలో ఆయా పార్టీలలో ఉన్న వర్గ పోరు కూడా కూటమికి సెగ పెంచేస్తోంది.
ఏపీలో ఎన్నికలు ఈసారి మే 13న ఉన్నాయి. అంటే నాలుగవ దశ అన్న మాట. ఈ దశ అయితే కూటమికే అతి పెద్ద అడ్వాంటేజ్ కావాల్సినంత సమయం ఉంది అని మొదట్లో భావించారు. కానీ చూడబోతే ఆ ఎక్కువ సమయమే కూటమికి మిక్కిలి కష్టాలు తెచ్చిపెడుతోంది అని అంటున్నారు. కాలం ఎక్కువ అయ్యే కొద్ది రోజులు గడిచే కొద్దీ కూటమిలో సర్దుబాట్లు కుదరకపోగా అవి మరింతగా ఎక్కువ అవుతున్నాయి.
ఎంతదాకా అంటే ఇంకా టైం ఉంది కదా ఫలానా చోట అభ్యర్ధిని మార్చండి అని సొంత పార్టీ నుంచి ధిక్కార స్వరాలు వినిపిస్తూంటే మిత్రులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అయితే ఎంపీ సీట్ల విషయంలో మళ్లీ మార్పులు చేయమంటోంది. విశాఖ ఎంపీ సీటు ఆ పార్టీ కోరుకుంటోంది. అలాగే ఎమ్మెల్యే సీట్లలో తమకు నచ్చిన చోట ఇమ్మని కోరుతోంది.
జనసేన విషయం చూస్తే ఆ పార్టీ తలనొప్పులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కలసి కూటమి మీదనే ప్రభావం చూపిస్తున్నాయి. అందరికీ సర్దిచెప్పుకునే బాధ్యత టీడీపీ మీదనే పడుతోంది. టీడీపీకి ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి. దానికి తోడు కూటమిలో కలహాలు వర్గ పోరు సమస్యలు అన్నీ నెత్తిన పడుతున్నాయి.
పోలింగ్ కి సరిగ్గా నలభై రోజులు మాత్రమే సమయం ఉన్నా ఇంకా కూటమిలో బాలరిష్టాలు తీరడం లేదు. ఉమ్మడిగా ఒకే ఒక సభ నిర్వహించారు. అది చిలకూరిపేటలో. ఆ తరువాత ఎవరి మానాన వారు ఉన్నారు. జనసేన ఇంకా ప్రచారం మొదలెట్టలేదు. పవన్ పిఠాపురానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
బీజేపీ అయితే ఇంకా సీట్ల పంచాయతీ దగ్గరే ఆగిపోయింది. మండు టెండలో చంద్రబాబు ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి ఎన్నికల ప్రణాళీక ఇంకా సిద్ధం చేయలేదు. మూడు పార్టీల నేతలతో కూటమి ప్రచారానికి వేగవంతం చేయాలనుకుంటే అది ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది.
ఈలోగా వాలంటీర్ల వివాదం కూడా బూమరాంగ్ అయ్యేలా ఉంది. మరో వైపు చూస్తే వైసీపీలో అభ్యర్ధుల మీద నిరసనలు వచ్చినా ఎక్కడా మార్చే ప్రసక్తి లేదని ఆ పార్టీ చెప్పేసింది. టీడీపీలో మాత్రం అభ్యర్థుల మార్పు కోసం అంతా ఒత్తిడి పెడుతున్నారు. ఇలాగైతే ఎప్పటికి కధ తెమిలేను అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా కూటమికి కష్టాలు అంతకంతకు పెరిగిపోతున్నాయని అంటున్నారు.