హాట్ టాపిక్: లిచ్ మాన్ నోట కమల గెలుపు మాట
ఎందుకుంటే.. ఆయన లెక్కలు కట్టి.. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న మాట వచ్చిందంటే.. ఇక.. సదరు అభ్యర్థి గెలుపు అన్నది ఖాయమైనట్లే
అలాన్ లిచ్ మాన్ అన్నంతనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని క్రమం తప్పకుండా ఫాలో అయ్యే వారికి మాత్రం అతగాడు సుపరిచితుడు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆయన పేరు మారుమోగుతుంది. ఆయన నోటి నుంచి వచ్చే మాటకు ఉండే విలువ అలాంటిది. ఎందుకుంటే.. ఆయన లెక్కలు కట్టి.. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న మాట వచ్చిందంటే.. ఇక.. సదరు అభ్యర్థి గెలుపు అన్నది ఖాయమైనట్లే.
గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు మీద లిచ్ మాన్ అంచనాలుఏ రోజు తప్పలేదు. ఆయన ఎవరైతే గెలుస్తారని చెబుతారో.. సదరు అభ్యర్థి గెలవటం ఒక ఆనవాయితీగా వస్తోంది. అలాంటి ఆయన నోటి నుంచి ఇప్పుడు డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన కమలాహారీస్ పేరును ప్రస్తావిస్తున్నారు. ట్రంప్ మీద గెలిచే అవకాశాలు ఉన్న నేతగా ఆయన చెబుతున్నారు. అయితే.. పూర్తిస్థాయి లెక్కలు కట్టిన తర్వాత తన తుది అంచనాలు వెలువరుస్తానని ఆయన చెబుతున్నారు.
ఆగస్టులో నిర్వహించే డెమోక్రటిక్ కన్వెన్షన్ తర్వాత తన తుది అంచనాలు ఇస్తానని చెప్పటంతో ఆయన నోటి నుంచి వచ్చే అంచనా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సరళి.. అమెరికా ఓటర్ల మనోభావాల్ని లెక్కలోకి తీసుకుంటే కమలా హారిస్ నెగ్గే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
ఇక.. లిచ్ మాన్ ట్రాక్ రికార్డును చూస్తే.. 1984 నుంచి జరిగిన 10 అధ్యక్ష ఎన్నికల్లో తొమ్మిదిసార్లు ఆయన చెప్పిందే జరిగింది. అందుకే ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్ (మనకు పోతులూరి వీరబ్రహ్మం ఎలానో.. ప్రాశ్చాత్యులకు నాస్ట్రోడామన్ అలా అన్న మాట)గా అభివర్ణిస్తారు. అమెరికా వర్సిటీలో యాభై ఏళ్లుగా అధ్యాపకుడిగా పని చేస్తున్న ఆయన 1981లో గెలుపునకు 13 సూత్రాలన్న కాన్సెప్టును తయారు చేశారు.దీనికి అనుగుణంగా ఏ ప్రకారం ఏపార్టీ గెలుస్తుందన్న విషయాన్ని ఆయన అంచనా కట్టి చెబుతుంటారు.