పవన్ పదేళ్ళు అంటే అంబటి మూన్నాళ్ళు...!
టీడీపీతో అలయెన్స్ దశాబ్ద కాలం కావాలంటావ్.. మూడు ముళ్ళు మాత్రం మూడు రోజులలో తెంచేస్తావ్ అని పవన్ మీద ట్వీట్ చేసారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అల్టిమేట్ పంచ్ పేల్చారు మంత్రి అంబటి రాంబాబు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పవన్ మాట్లాడుతూ టీడీపీ జనసేన బంధం పదేళ్ల పాటు పది కాలాల పాటు ఉండాలని గట్టిగా కోరుకున్నారు. దానికి అంబటి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అదిరిపోయే పంచ్ వేశారు.
టీడీపీతో అలయెన్స్ దశాబ్ద కాలం కావాలంటావ్.. మూడు ముళ్ళు మాత్రం మూడు రోజులలో తెంచేస్తావ్ అని పవన్ మీద ట్వీట్ చేసారు. పవన్ పెళ్ళిళ్ల మీద వేసిన ట్వీట్ ఇది. పవన్ మూడు వివాహాలు చేసుకున్నారని వైసీపీ నేతలు తరచూ అంటూంటారు. సీఎం జగన్ అయితే శ్రీకాకుళం మీటింగులో ఏకంగా పవన్ కళ్యాణ్ ని పట్టుకుని ప్యాకేజీ స్టార్ మ్యారేజీ స్టార్ అని కొత్త ట్యాగ్ తగిలించారు.
ఇంతకీ పవన్ ఏమన్నారు అంటే ఏపీలో ఒక పదేళ్ల పాటు అయినా జనసేన టీడీపీ ప్రభుత్వం ఉంటే రాజకీయ సుస్థిరత ఉంటుందని. అలాగే ఏపీలో జనసేన టీడీపీలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇక ఏపీలో 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిని గెలిపించడం చాలా అవసరం అని పవన్ అంటున్నారు.
రాష్ట్రం బాగుపడాలీ అంటే తమ కూటమిని గెలిపించమని పవన్ కోరారు. ఇక కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఏపీలో మాత్రం బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ముస్లిం మైనారిటీ వర్గాలకు తాను అండగా ఉంటాను అని అంటున్నారు.
విశాఖకు చెందిన కార్పోరేటర్ జనసేనలో చేరిన సందర్భంగా పవన్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు ఏదైనా ఇబ్బంది వచ్చినా అన్యాయం జరిగినా తాను వారికి అండంగా ఉండి పోరాడుతాను అని స్పష్టం చేశారు. జనసేనను ఈ ఒక్కసారికి నమ్మాలని ఆయన కోరుతున్నారు. తాను మాట ఇస్తే వెనక్కి వెళ్లను అని పవన్ చెబుతున్నారు.
మరో వైపు జనసేన పార్టీ ప్రచార బాధ్యతలు నిర్మాత బన్నీ వాసుకు అప్పగించారు. జనసేన ప్రచార విభాగం చైర్మన్ గా ఆయనను పవన్ నియమించారు. రానున్న ఎన్నికల కోసం జనసేన కార్యక్రమాలను ప్రచార రూపంలో ముందుకు తీసుకెళ్లాలని పవన్ కోరారు. మొత్తానికి పవన్ టీడీపీ బంధం పదేళ్ళు అంటే అంబటి మూడు ముళ్ళు మూన్నాళ్ళు అంటున్నారు.
పవన్ తీసుకున్న పొత్తు నిర్ణయం మీద ఇప్పటికే జనసేనలో అంతర్మధనం సాగుతోంది. అయితే ఈ పొత్తు అయిదేళ్ళు కాదు పదేళ్ళు కొనసాగుతుందని పదే పదే పవన్ చెప్పడం బట్టి చూస్తే జనసైనికులు తాము పాలకులు అవుతారా లేక టీడీపీకి జూనియర్ పార్టనర్ గా మిగిలిపోతారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ సమయంలో అంబటి వేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.