అమరావతితో మాత్రమే కాదు సుమా ?

ఏపీలో మూడు ప్రాంతాలు ఉన్నాయి. ఈ రీజియన్లలో ప్రజల ఆకాంక్షలు ఆశలు బలంగా ఉంటాయి.

Update: 2024-06-24 04:17 GMT

ఏపీలో మూడు ప్రాంతాలు ఉన్నాయి. ఈ రీజియన్లలో ప్రజల ఆకాంక్షలు ఆశలు బలంగా ఉంటాయి. సెంటిమెంట్లు కూడా ఎక్కువ అని చెప్పాలి. ప్రజలు ఇస్తున్న తీర్పుని రాజకీయ పార్టీలు సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవడం వల్లనే వరసగా అధికార పార్టీలు గత రెండు ఎన్నికల్లోనూ ఓటమిని చూసాయని అంటున్నారు.

విభజన తరువాత ఏపీలో జరిగిన ఎన్నికల్లో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబుకు గురుతర బాధ్యతను జనాలు పెట్టారు. ఆయన మంచి రాజధానిగా అమరావతిని కట్టాలని అనుకున్నారు. దానిని ప్రపంచ రాజధానిగా డిజైన్ చేశారు. దానికోసం 53 వేల ఎకరాల భూములను సేకరించారు.

అయితే బాబు వేసుకున్న భారీ కాన్వాస్ కి ఏపీ బడ్జెట్ కి పొంతన కుదరక అయిదేళ్ళ సమయం చాలక చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈ లోగా అమరావతి జపంతో మిగిలిన ఉత్తరాంధ్రా రాయలసీమ వాసులకు కోపాలు వచ్చాయి. అంతా అక్కడేనా అంటూ వారు కన్నెర్ర చేశారు.

అలా వచ్చిన యాంటీ సెంటిమెంట్ టీడీపీని 2019లో ఓడించింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే జగన్ ప్రజల తీర్పుని సవ్యంగా అర్ధం చేసుకోలేకపోయారు. ఉత్తరాంధ్రా రాయలసీమ వాసులు అమరావతికి వ్యతిరేకం అని ఆయన అనుకున్నట్లుగా ఉన్నారు దాంతో మూడు రాజధానుల కాన్సెప్ట్ తెర మీదకు తెచ్చారు. అయితే అది న్యాయ వివాదాలలో చిక్కుకుని అతీ గతీ లేకుండా పోయింది. దాంతో పాటు పాలకుల చిత్తశుద్ధి కూడా జనాల్లో డౌట్లు పెంచింది.

మూడు ముక్కలాటతో రాజకీయాన్ని పండించుకోవడం తప్ప తమకు ఒరిగేది లేదని అటు సీమ ఇటు ఉత్తరాంధ్ర యాంటీ అయ్యారు. అమరావతి వాసులు సరేసరి. మొత్తానికి 2024 ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన ఓటమి పలకరించింది అంటే దానికి రాజధాని వ్యవహరమే సింహ భాగం ఉంటుందని చెప్పక తప్పదు.

ఇంతకీ ఉత్తరాంధ్రా రాయలసీమ వాసులు కోరుకున్నది అమరావతి రాజధానిని తీసేయమని కాదు. అక్కడ రాజధానికి ఈ రెండు ప్రాంతాలూ అనుకూలమే. దాన్ని అలా కొనసాగించి ఏపీకి మంచి రాజధానిని చూపిస్తూనే తమ ప్రాంతాలను అభివృద్ధి చేయమని. అలాగే అన్నీ అమరావతి చుట్టూనే పెట్టకుండా తమ ప్రాంతాలలోనూ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయమని.

అలా చూసుకుంటే శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని అయినా లేదా హైకోర్టు అయినా కర్నూల్ కి ఇవ్వాలి. అమరావతిని రాజధానిగా చేస్తున్నారు కాబట్టి కర్నూల్ కి హైకోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో సంప్రదించి సీమ వాసులకు న్యాయం చేయాల్సి ఉంది.

అదే విధంగా విశాఖకు హైకోర్టు బెంచ్ అయినా ఇవ్వాలని డిమాండ్ ఉంది. అలాగే పరిశ్రమలు విశాఖలో ఎక్కువగా వచ్చేలా చూడడం, విశాఖను ఏపీలో మెగా సిటీగా అభివృద్ధి చేయడం, ఉత్తరాంధ్రాలో కూడా అభివృద్ధి ఫలాలు అందించడం చేయాలి. ఇక రాయలసీమ నాలుగు జిల్లాలలోనూ ఆయా ప్రాంతాలకు తగిన విధంగా ప్రభుత్వ ఆఫీసులను తరలించడం పరిశ్రమలు అభివృద్ధి వంటివి చేయడం కూటమి ప్రభుత్వ బాధ్యతలు.

అన్నీ అమరావతి అని 2014 నుంచి 2019 దాకా వినిపించిన స్లోగన్ ని ఆపేసి సమగ్రమైన అభివృద్ధి దిశగా కూటమి పాలకులు అడుగులు వేయాల్సి ఉంది. లేకపోతే మళ్లీ ఈ రెండు రీజియన్లలోనూ అసంతృప్తి పెరిగి అది రాజకీయంగా టీడీపీకే ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు. మొత్తం మీద రెండు ఎన్నికల తరువాత చూస్తే అమరావతి రాజధాని విషయంలో ఏపీ మొత్తంగా అంతా ఏకంగ్రీవంగా అంగీకరించిన వాతావరణం అయితే ఏర్పడింది.

దానిని ప్రాతిపదికగా తీసుకుని వెనకబడిన ఉత్తరాంధ్రా రాయలసీమలోని ఏడు జిల్లాలకు ఏమి చేయాలి,విభజన హామీలు చట్టంలో ఉన్న వాటి ప్రకారం ఏ విధంగా న్యాయం చేయాలి అన్నది కూటమి పెద్దలే ఆలోచించాల్సి ఉంది.

Tags:    

Similar News