అమిత్ షా కాన్వాయ్ లో కార్లకు ఆ సిరీస్.. దానికి సంకేతమేనా?
ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'DL1 CAA4421' అనే నంబర్ ప్లేట్ ఉన్న కారులో అమిత్ షా బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తున్నట్లు కనిపించింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్ల కాన్వాయ్ లో నంబర్ల సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ సీఈసీ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా కార్ల కాన్వాయ్ లోని ఒక నంబర్ ప్లేట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'DL1 CAA4421' అనే నంబర్ ప్లేట్ ఉన్న కారులో అమిత్ షా బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తున్నట్లు కనిపించింది.
2024 లోక్ సభ ఎన్నికల కోసం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమలుకు ముందు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) 2019 నిబంధనలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమిత్ షా కార్ల కాన్వాయ్ లో 'DL1 CAA4421' అనే నంబర్ హాట్ టాపిక్ గా మారింది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమలులోకి వస్తుంది. ఇది మార్చి రెండో వారంలో జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాగా పౌరసత్వ సవరణ చట్టాన్ని డిసెంబర్ 2019లో పార్లమెంట్ ఆమోదించింది. అయితే సీఏఏను ఇప్పటి వరకు అమలు చేయలేదు. ప్రతిపక్షాలు ఈ చట్టాన్ని మత ప్రాతిపదికన ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోందని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా కార్ల కాన్వాయ్ లో నంబర్ ప్లేటుకు 'DL1 CAA4421' అని ఉండటం ఆసక్తి రేపుతోంది.
కాగా లోక్ సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అమిత్ షా గతంలోనే వెల్లడించారు. ముస్లిం సోదరుల్ని సీఏఏకి వ్యతిరేకంగా కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లలో హింసను ఎదుర్కొని భారత్ కు వచ్చినవారికి పౌరసత్వం ఇవ్వడమే సీఏఏ ఉద్దేశమని అమిత్ షా తేల్చిచెప్పారు. ఏ ఒక్కరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడం కోసం కాదని అని స్పష్టతనిచ్చారు. సీఏఏ అమలుకు ముందు దానికి సంబంధించిన నిబంధనలను తప్పక జారీ చేస్తామన్నారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని డిసెంబర్ 2019లో పార్లమెంట్ ఆమోదించిందని అమిత్ షా గుర్తు చేశారు. ఈ చట్టం ఎవరి పౌరసత్వాన్ని హరించదని తెలిపారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం అందించడానికే ఈ చట్టమని స్పష్టం చేశారు.