మాస్ టూరిజానికి వ్యతిరేకంగా నెథర్లాండ్ కీలక నిర్ణయం!
సాధారణంగా సుమారుగా చాలా దేశాలు టూరిజం అభివృద్ధికి సరికొత్త చర్యలు చేపడుతుంటాయి
సాధారణంగా సుమారుగా చాలా దేశాలు టూరిజం అభివృద్ధికి సరికొత్త చర్యలు చేపడుతుంటాయి. పైగా కోవిడ్ తర్వాత ఈ కార్యక్రమాలు మరింత పెరిగాయి. అందులో భాగంగా.. వీసా ఫ్రీ ఆఫర్లు కూడా పలు దేశాలు అందించాయి. అయితే అందుకు భిన్నంగా అన్నట్లుగా.. నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ మాస్ టూరిజానికి వ్యతిరేకంగా కీలక చర్యలు చేపట్టింది. ఈ మేర్కు ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది.
అవును... నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ మాస్ టూరిజానికి వ్యతిరేకంగా చేపడుతున్న చర్యల్లో భాగంగా కొత్త హోటల్ భవనాలను నిర్మించడాన్ని ఇకపై అనుమతించదని స్థానిక ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా... తాము నగరాన్ని స్థానికులు ప్రశాంతంగా నివసించడానికి ఉంచాలనుకుంటున్నాము అని వెల్లడిస్తూ... హోటళ్ల నిర్మాణాల విషయంలో కీలక ప్రకటన చేసింది.
ఇందులో భాగంగా... ఇకపై ఓవర్ టూరిజం లేదు, కొత్త హోటళ్ళు లేవు, పర్యాటకులు సంవత్సరానికి 20 మిలియన్ల కంటే ఎక్కువ హోటల్ లలో బస చేయకూడదు అని వెల్లడించింది. ఆమ్ స్టర్ డామ్ లో ఇప్పటికే ఉన్న ఓ హోటల్ మూసివేస్తే మాత్రమే కొత్త హోటల్ నిర్మించబడుతుందని వెల్లడించింది. అయితే, ఇప్పటికే అనుమతి పొందిన కొత్త హోటళ్లకు ఈ నిబంధన వర్తించదని తెలిపింది.
నగరంలో ఓవర్ టూరిజం సమస్యను తగ్గించడానికి డచ్ రాజధాని తీసుకున్న చర్యల శ్రేణిలో ఇది తాజాది కాగా... ప్రధానంగా సెక్స్, డ్రగ్ సంబంధిత పర్యాటకాన్ని నిరోధించడం వల్ల ఏటా మిలియన్ల సంఖ్యలో వచ్చే పర్యాటకుల సంఖ్యను పరిమితం చేయడానికి నగరం చురుకుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది ఆమ్ స్టర్ డామ్ సిటీ కౌన్సిల్ క్రూయిజ్ షిప్ లను నిషేధించడానికి ఓటు వేసింది.
ఇదే క్రమంలో ఇప్పటికే నగరం రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ లోని పబ్లిక్ వీధుల్లో గంజాయి వాడకాన్ని నిషేధించింది.. ఇదే సమయంలో సెక్స్ వర్కర్ల ద్వారా వెళ్ళే గైడెడ్ టూర్ లకు ముగింపు పలికింది. ఆమ్ స్టర్ డామ్ టూరిజం ఇన్ బ్యాలెన్స్ అని పిలువబడే 2021 ఆర్డినెన్స్ ప్రకారం, టూరిజం సంఖ్య 18 మిలియన్ల మందికి చేరుకున్నప్పుడు సిటీ కౌన్సిల్ జోక్యం చేయవలసి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేసింది!!