ఇప్పుడు వన్ వే.. తర్వాత టూవేనా... ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్..!
అంతగా తాము గెలుస్తామనే భావనను పార్టీలు ప్రజల్లోకి తీసుకువెళ్తన్నాయి. ఇప్పుడు ఏపీలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి.
ఏపీ రాజకీయాల్లో వన్ సైడ్ చేరికలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీలో టికెట్లు ఆశించి దక్కనివారు.. నచ్చిన టికెట్ ఇవ్వని వారు.. వరుస పెట్టి టీడీపీ బాట పడుతున్నారు. అయితే.. ప్రస్తుతానికి ఇది వన్ వే ట్రాఫిక్‌గానే కనిపిస్తున్నా.. టీడీపీ-జనసేన కూటమిలోనూ టికెట్ల ప్రకటన తర్వాత.. టూ వే అవుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో జంపింగులకు కొదవ లేదు. ఓ పార్టీలో సీటు దక్కని నేతల్లో గెలుపు గుర్రాలు అనుకుంటే మరో పార్టీ ఆఫర్ చేసి మరీ తమ పార్టీలో చేర్చుకుంటుంది.
గత ఏడాది జరిగిన తెలంగాణ ఎన్నికల్లో అదే జరిగింది. అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ లో టిక్కెట్ దక్కని నేతల్లో బలమైన నేతల్ని చేర్చుకుని కాంగ్రెస్ పార్టీ లాభపడింది. పది మందికిపైగా ఇలా బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు కూడా.
రాజకీయాల్లో చేరికలు వ్యూహంగా మారాయి. ఎంత మంది ఎక్కువ చేరితే.. అంతగా తాము గెలుస్తామనే భావనను పార్టీలు ప్రజల్లోకి తీసుకువెళ్తన్నాయి. ఇప్పుడు ఏపీలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి.
అక్కడ వైసీపీ టిక్కెట్ల కసరత్తు ప్రారంభించి.. అధికారిక ప్రకటనలు కూడా చేస్తూండంతో.. చాలా మంది తమ దారులు తాము చూసుకుంటున్నారు. టీడీపీలోకి వైసీపీ నుంచి బలమైన నేతలు వచ్చి చేరుతుండడం రాజకీయంగా ఆసక్తిగా మారింది. టిక్కెట్లు ఇవ్వని వారు జంప్ చేయడం సరే.. కానీ, టిక్కెట్ ఖరారు చేసిన వారు కూడా వచ్చేస్తున్నారు. తిరుపతి ఎంపీ టిక్కెట్ ఖరారు చేసిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనకు వద్దని చెప్పి టీడీపీలో చేరారు.
నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీకి దూరమయ్యారు. ఆయన కూడా టీడీపీలో చేరనున్నారు. ఇక నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు కూడా టీడీపీలో చేరడం ఖాయమైంది. ఈ జాబితాలో మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా ఉన్నారు. ఆయన కుమారుడు పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో చంద్రబాబుతో భేటీ అయ్యారని సమాచారం. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వీరికి అనుచరణ గణం ఉంది. ఆయన ఖచ్చితంగా టీడీపీకి ప్లస్ అవుతారు.
అందుకే గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఖరారు చేసినా సీఎం జగన్ .. వైవీ సుబ్బారెడ్డికి టిక్కెట్ నిరాకరించి మరీ ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనకు టిక్కెట్ ఇచ్చేదే లేదని బయటకు పంపేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ చేరికలు ఇప్పుడు వన్ సైడ్‌గా జోరుగా సాగుతున్నాయి. మరి రేపు టిడీపీ-జనసేన అభ్యర్థులను ప్రకటించాక ఏం జరుగుతుందో అనేది అసలు చర్చ. దీని కోసమే వైసీపీ వెయిట్ చేస్తోందని అంటున్నారు.