ఏపీలో కొత్త పార్టీలు.. లెక్క ఇదే .. !
వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పుడున్న పార్టీలకు తోడు.. మరిన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి. వీటిలో తాజాగా మూడు పార్టీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పుడున్న పార్టీలకు తోడు.. మరిన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి. వీటిలో తాజాగా మూడు పార్టీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆప్, రాయలసీమ పార్టీ, ఉత్తరాంధ్ర పార్టీ, జై భీం రావ్ పార్టీ, సీపీఎం, సీపీఐ వంటివి ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని మాత్రమే ప్రజాక్షేత్రంలో ఉన్నాయి.
అయినప్పటికీ.. ఎన్నికల సమయంలో ఈ పార్టీలన్నీ కూడా.. వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇదిలావుంటే..ఇప్పుడు ఈ పార్టీలకు తోడు అమరావతి హక్కుల పరిరక్షణ సమితి.. త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరించనుంది. ఇది.. ఉమ్మడి కోస్తా జిల్లాలు సహా.. కర్నూలు, అనంతపురంలో పోటీకి సిద్ధమవుతోంది. రాజధాని సెంటిమెంటుతో ఈ పార్టీని ప్రారంభించాలని నిర్ణయించారు.
ఇదిలావుంటే, ఇప్పుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా.. జై భారత్ నేషనల్ పార్టీని ప్రారంభించా రు. ఇది మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలబెడుతుందని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. అభ్యర్థులు ఎవరు ఏంటనేది చెప్పకపోయినా.. జై భారత్ నేషనల్ పార్టీ మేధావి వర్గాన్ని, రిటైర్ట్ వర్గాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక, మరో పార్టీ కూడా ఎన్నికలకు రెడీఅవుతోంది. అదే.. పెన్షనర్ల పార్టీ. ఇప్పటి వరకు విని ఉండని ఈ పార్టీకి తాజాగా ఎన్నికల సంఘంగుర్తింపు ఇచ్చినట్టు తెలిసింది.
ఏపీలో ఉద్యోగులు కదం తొక్కుతున్న విషయం తెలిసిందే. తమకురావాల్సిన జీతాలను 1న కూడా ఇవ్వడం లేదని, ఇక, డీఏ బకాయిలు ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ .. ఇప్పటి వరకు దానిని రద్దు చేయకపోగా.. జీపీఎస్ తెచ్చారని మండిపడుతున్నారు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. దీనిని గమనించిన పెన్షనర్లు.. తాజాగా "పెన్షనర్స్ పార్టీ" పేరుతో కొత్త రాజకీయపార్టీని ప్రకటించారు.
దీనిని మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో దీనిని స్థాపించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా మాజీ అధికారి సుబ్బరాయన్ ను ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో అన్ని అర్బన్ ప్రాంతాల్లో 'పెన్షనర్స్ పార్టీ' పోటీలో ఉంటుందన్నారు. పెన్షనర్ల హక్కుల కోసం, యువత భవిష్యత్తు కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశామని.. గుర్తింపు లభించిందని చెప్పడం గమనార్హం.