కేబినెట్ నిర్ణయం... వాలంటీర్లకు తొలి షాక్ తగిలినట్లేనా!?
వీరిని తన సైన్యంగా చెప్పుకుంటూ సంక్షేమ పథకాల పంపిణీ పేరుతో రూ.5 వేల రూపాయల గౌరవ వేతనాన్ని నిర్ణయించింది.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఎంత చర్చనీయాంశం అనే సంగతి తెలిసిందే. ప్రధానంగా ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచీ వీరికి సంబంధించిన చర్చలు మరింత వైరల్ గా మారాయి. వైసీపీ అధికారంలోకి రాగానే సుమారు 2.67 లక్షల మంది వాలంటీర్లను నియమించారు జగన్. వీరిని తన సైన్యంగా చెప్పుకుంటూ సంక్షేమ పథకాల పంపిణీ పేరుతో రూ.5 వేల రూపాయల గౌరవ వేతనాన్ని నిర్ణయించింది.
దీంతో... ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నేతలూ దూరమై వాలంటీర్లు మాత్రమే దగ్గరయిన పరిస్థితి నెలకొందనే వ్యాఖ్యలు స్వయంగా వైసీపీ నేతలే చేస్తున్నారు. అయితే... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు.. కూటమి అధికారంలోకి వస్తే వారి జీతాలు 10వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాల జరిగిన కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు.
అవును... నూతన ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వాలంటీర్లకు ఇప్పటివరకూ ఉన్న ఒక బాధ్యతను పక్కన పెట్టింది. రాష్ట్రంలో పెన్షన్ పంపిణీకి వాలంటీర్లకు బదులుగా గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది సేవలను వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇకపై ప్రతీ నెలా సచివాలయ సిబ్బందే పెన్షన్ ఇంటింటికీ పంపిణీ చేస్తారని మంత్రి పార్థసారథి తెలిపారు. కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సమాచార మంత్రి పార్థసారథి... వాలంటీర్లను ఎలా ఉపయోగించాలనే విషయంపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని తెలిపారు. జూలై 1 న పెన్షన్ల పంపిణీ బాధ్యతలు మాత్రం వారికి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
దీంతో వాలంటీర్లను ఈ సర్కార్ పక్కన పెడుతున్నట్లేనా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో... వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే అంశంపై మాత్రం ఇవాళ కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో... ముందుముందు వీరి కొనసాగింపు ఉంటుందా.. 5 నుంచి 10 వేల రూపాయలకు జీతాల పెంపు అంశంపై బాబు మనసులో ఏముంది అనే పలు విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. .
కాగా... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయలో సుమారు లక్ష మంది వరకూ వాలంటీర్లు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత.. తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారు. మంత్రి అచ్చెన్న సూచనల మేరకు వారంతా ఆయా నేతలపై పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు చేస్తున్నారు. మరి వీరి విషయంలోనూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.