కెనడా నుంచి విద్యార్థుల మరో షాకింగ్ న్యూస్!

అవును... కెనడాకు వచ్చే విదేశీ విద్యార్థులకు కొత్తగా ఇచ్చే స్టడీ పర్మిట్లపై రెండేళ్ల పాటు పరిమితి విధించనున్నట్లు ఆ దేశ ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్ ప్రకటించారు.

Update: 2024-01-24 03:15 GMT

కెనడాకు వెళ్లి చదువుకునే విదేశీ విద్యార్థుల విషయంలో ఆ దేశం కీలక నిర్ణయాలు తీసుకోబోతుందంటూ గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. అయితే తాజాగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కెనడా ప్రభుత్వం ఇందులో భాగంగా.. కొత్తగా ఇవ్వబోయే స్టడీ పర్మిట్లపై రెండేళ్ల పాటు పరిమితి విధించనున్నట్లు వెల్లడించింది.

అవును... కెనడాకు వచ్చే విదేశీ విద్యార్థులకు కొత్తగా ఇచ్చే స్టడీ పర్మిట్లపై రెండేళ్ల పాటు పరిమితి విధించనున్నట్లు ఆ దేశ ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్ ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఇస్తున్న వాటిలో మూడో వంతు కోత పెట్టనున్నట్లు తెలిపారు. దేశీయంగా పెరుగుతున్న నిరుద్యోగం, ఇళ్ల కొరత వంటి సమస్యలకు చెక్‌ పెట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారంటూ గతంలోనే కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.

అయితే... ఇప్పటికే ఇచ్చిన పర్మిట్లపై ఈ నిబంధన వర్తించదని, వారిపై ఎటువంటి ప్రభావం ఉండదని మార్క్ మిల్లర్‌ స్పష్టం చేశారు. ఇదే సమయంలో... మాస్టర్స్‌, డాక్టోరల్‌ విద్యార్థులకు తాజాగా విధించనున్న పరిమితులు వర్తించవని తెలిపారు. ఈ క్రమంలో మారిన నిబంధనల ప్రకారం.. ప్రావిన్స్‌ ల వారీగా పర్మిట్లను కేటాయిస్తారు. ఈ మేరకు తగిన మార్పులు చేసుకునేందుకు కెనడా ప్రభుత్వం ప్రావిన్స్‌ లకు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది.

ఇదే సమయంలో... పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వర్క్‌ పర్మిట్లకు సంబంధించిన అర్హతల్లోనూ కెనడా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా... 2024 సెప్టెంబర్‌ నుంచి కరికులం లైసెన్సింగ్‌ అరేంజ్‌మెంట్స్ కింద రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు వర్క్‌ పర్మిట్‌ ఇవ్వబోమని తెలిపింది. అయితే... కొత్త నిబంధనలమేరకు పరిమితి అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది సుమారు 3.64 లక్షల మందికి పర్మిట్లు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కాగా కెనడాలో విద్యనభ్యసించడానికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికమనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ఏడాది కెనడా 2,25,835 స్టడీ పర్మిట్లు జారీ చేయగా.. అందులో 41 శాతం పర్మిట్లను భారతీయ విద్యార్థులే సొంతం చేసుకున్నారు.

Tags:    

Similar News