పుణే కారు యాక్సిడెంట్‌ కేసులో మరో ట్విస్ట్‌... ఈసారి డాక్టర్స్ వంతు!

పుణెలో టీనేజర్ పోర్ష్‌ కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో రకరకాల ట్విస్టులు, జలక్కులు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-05-27 06:20 GMT

పుణెలో టీనేజర్ పోర్ష్‌ కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో రకరకాల ట్విస్టులు, జలక్కులు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారు డ్రైవ్ చేసింది తమ ఫ్యామిలీ డ్రైవర్ అని.. తర్వాత ఆ యువకుడి తాత ఆ డ్రైవర్ ను బెదిరించాడని.. రకరకాల విషయాలు ఈ కేసులో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

అవును... పుణె లో టీనేజర్ కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృతి చెందిన కేసులో అనుకోని ట్విస్ట్‌ ను తాజాగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గుర్తించారట. ఇందులో భాగంగా... ఈ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్‌ కి సంబంధించిన బ్లడ్ శాంపుల్స్ టెస్ట్ లో నివేదికను ఇద్దరు వైద్యులు మార్చేసినట్లు గుర్తించారట. దీంతో వారిపైనా చర్యలు మొదలైనట్లు తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... పూణెలోని కారు ర్యాష్ డ్రైవింగ్ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్ నుంచి బ్లడ్ శాంపుల్స్ ని సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ సమయంలో... సాసూన్‌ ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ అజేయ్‌ తావ్రే, డాక్టర్‌ శ్రీహరి హార్నూర్‌ లు ఆ నివేదికను మార్చేశారంట. దీంతో వీరిని పుణే క్రైం బ్రాంచి పోలీసులు అరెస్టు చేశారు.

వీరిలో డాక్టర్‌ తావ్రే.. పుణేలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఫోరెన్సిక్‌ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన మొదట్లో అబ్జర్వేషన్‌ హోమ్‌ లో ఉన్న నిందితుడు రక్త నమూనాల్లో ఎటువంటి ఆల్కహాల్‌ ఆనవాలు లేవని నివేదిక ఇచ్చారు. అయితే... పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. నిందితుడు మద్యం తాగినట్లు ధ్రువీకరించుకొన్నారు. దీంతో డాక్టర్లను అదుపులోకి తీసుకొన్నారు.

వాస్తవానికి నిందితుడి తండ్రి స్థానికంగా బడా రియల్టర్‌ అని చెబుతున్నారు. ఈ కేసును మొదటి నుంచీ తప్పుదోవ పట్టించి మైనర్‌ ను రక్షించేందుకు అతడి కుటుంబీకులు తీవ్ర యత్నాలు చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే వారి డ్రైవర్‌ ను ఈ కేసులో ఇరికించేందుకు నిందితుడి తండ్రి, తాత తీవ్ర స్థాయిలో యత్నించినట్లు గుర్తించారు.

ఇదే సమయంలో ఈ కేసులో కొంతమంది పోలీసులను ప్రభావితం చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. దీంతో... ఇద్దరు అధికారులపై వేటు వేసిన పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా ఫోరెన్సిక్‌ పరీక్షలు చేసే వైద్యులు కూడా రక్త నమూనాలను తారుమారు చేయడానికి యత్నించారని చెబుతున్నారు. దీంతో... ఈ కేసును తప్పుదోవపట్టించేందుకు ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే చర్చ తెరపైకి వచ్చింది.

కాగా... పూణేలో గత ఆదివారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆ బాలుడికి జువైనల్‌ కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఆ ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది.

ఇదే సమయంలో... మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, భవిష్యత్‌ లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది. ఈ సమయంలో తీర్పుపై విమర్శలు రావడంతో జువెనైల్ జస్టిస్ బోర్డ్ తీర్పును సవరించింది. బాలుడిని అబ్జర్వేషన్ హోమ్‌ కు పంపించింది. నిందితుడి తండ్రి, తాత, రెండు బార్‌ ల సిబ్బందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే!

Tags:    

Similar News