వైసీపీకి బిగ్‌ షాక్‌.. టీడీపీలోకి మరో ఎమ్మెల్యే!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముంగిట అధికార ౖవైసీపీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి.

Update: 2024-02-07 11:51 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముంగిట అధికార ౖవైసీపీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. ఇదే కోవలో ఇప్పుడు వైసీపీకి మరో షాక్‌ తగలబోతోంది.

ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ మేరకు ఆయన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తో తాజాగా భేటీ అయ్యారని టాక్‌ నడుస్తోంది.

కాగా మానుగుంట మహీధర్‌ రెడ్డి తొలిసారి 1989లో కందుకూరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి 1500 స్వల్ప ఓట్ల తేడాలో ఓటమి పాలయ్యారు.

తిరిగి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా మహీధర్‌ రెడ్డి విజయం సాధించారు. అంతేకాకుండా కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మున్సిపల్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో మహీధర్‌ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

కాగా గతంలో మూడుసార్లు మహీధర్‌ రెడ్డి తండ్రి ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్యేగా కందుకూరు నుంచి గెలుపొందారు. అలాగే మహీధర్‌ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొత్తం మీద తండ్రీకుమారుడు ఏడుసార్లు కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు.

ప్రస్తుతం కందుకూరు నెల్లూరు జిల్లా పరిధిలో చేరింది. వచ్చే ఎన్నికల్లో మానుగుంట మహీధర్‌ రెడ్డికి సీటు నిరాకరించారని వార్తలు వస్తున్నాయి. వివాదరహితుడిగా, సౌమ్యుడిగా మానుగుంటకు మంచి పేరుంది. అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంలో దూకుడుగా ఉండటం లేదని వైసీపీ అధిష్టానం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే తనకు టికెట్‌ ఇచ్చినా, ఇవ్వకపోయినా బూతులు తిట్టే రాజకీయాలు తాను చేయబోనని మహీధర్‌ రెడ్డి తెలిపారని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌.. మానుగుంట మహీధర్‌ రెడ్డికి సీటు నిరాకరించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన నారా లోకేశ్‌ ను కలిశారని టాక్‌ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఆయన టీడీపీలో చేరతారని అంటున్నారు.



Tags:    

Similar News