రేషన్ బియ్యం మీద కూటమి సంచలన నిర్ణయం ?

ఏపీలో రేషన్ బియ్యం మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సాధారణంగా చౌక బియ్యం గురించి ఎపుడూ ఈ లెవెల్ లో చర్చ అయితే సాగింది లేదు.

Update: 2024-12-02 03:45 GMT

ఏపీలో రేషన్ బియ్యం మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సాధారణంగా చౌక బియ్యం గురించి ఎపుడూ ఈ లెవెల్ లో చర్చ అయితే సాగింది లేదు. దానికి కారణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడమే అని అంటున్నారు. గత రెండేళ్ళుగా పవన్ ఇదే విషయం మీద ఉన్నారు.

అక్రమంగా లక్షల టన్నులలో విదేశాలకు పోతున్న ఈ ఉచిత బియ్యం కొందరు అక్రమార్కులకి వేల కోట్ల ఆదాయంగా మారుతోందని భావిస్తున్నారు. దానికి అడ్డుకట్ట వేసేందుకు చెక్ చెప్పేందుకు కూడా ఆయన గట్టి పట్టుదల మీద ఉన్నారు. పవన్ ఎంతలా పట్టుబట్టు ఉన్నారు అన్న దానికి ఒక అచ్చమైన ఉదాహరణను చూస్తే మూడు రోజుల క్రితం తుఫానుతో అలజడిగా ఉన్న సముద్రంలోకి ఆయన బోట్లు వేసుకుని మరీ వెళ్ళి సీజ్ అయిన షిప్ ని పరిశీలించడమే అని అంటున్నారు.

అంతలా ఆయన దీని మీద ఫోకస్ పెట్టేశారు. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ పోర్టులోకి ల్యాండ్ అయిన పవన్ ఒక పూట అంతా అక్కడే గడిపారు. అక్రమార్కులను కనిపెడతామని రేషన్ బియ్యం మాఫియాకు పూర్తి స్థాయిలో చెక్ పెడతామని కూడా ఆయన అంటున్నారు.

ఈ నేపధ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ గా ఉంది. ఈ నెల 3న జరిగే మంత్రివర్గ సమావేశంలో కాకినాడ పోర్టు అక్రమ బియ్యం రవాణాకు అడ్డాగా మారిన వైనం మీద చర్చిస్తారు అని అంటున్నారు. దీనిని అరికట్టేందుకు గల అవకాశాల మీద పూర్తి స్థాయిలో చర్చిస్తారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే రేషన్ బియ్యం ఒకప్పుడు రెండు రూపాయలు ఉండేది. ఆ తరువాత అది రూపాయికే ఇస్తూ వచ్చారు. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో ఉచితంగా అందిస్తున్నారు మనిషికి అయిదు కేజీల వంతున ఈ బియ్యం ఇస్తున్నారు. అయితే ఈ బియ్యం పూర్తిగా దుడ్డుగా ఉండడంతో ఎవరూ తినలేకపోతున్నారు.

దాంతో దీనిని రేషన్ డీలర్ కే కిలో పది రూపాయలు వంతున అమ్మేస్తున్నారు. అలా నూటికి తొంబై శాతం బియ్యం రేషన్ బియ్యం తీసుకోకుండా నగదే తీసుకుంటున్నారు అన్నది బహిరంగ రహస్యం. దాంతో ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తుంది అని అంటున్నారు.

ప్రజలు ఎవరూ ఈ బియ్యం తీసుకోకపోతే ఎందుకు రేషన్ ద్వారా బియ్యం ఇవ్వడం అన్న ఆలోచనలో కూడా సర్కార్ ఉన్నట్లుగా అంటున్నారు. దాంతో రానున్న రోజులలో రేషన్ బియ్యం మీద సంచలన నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.

అంటే రేషన్ దుకాణాలలో బియ్యానికి బదులుగా నగదుని వారి ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు. అంతే కాదు బియ్యానికి బదులుగా ఇతర సరుకులు ఇచ్చేలా కూడా ఆలోచన చేస్తోందని అంటున్నారు. దాంతో రేషన్ బియ్యం ఎటూ తరలిపోకుండా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వ వర్గాలలో చర్చ అయితే సాగుతోంది. అదే కార్యరూపం దాలిస్తే రేషన్ లబ్దిదారులకు ఏ నష్టమూ ఉండదు, వారికి బియ్యానికి బదులుగా నగదు ఖాతాలో పడుతుంది. ఈ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి దోచుకునే దందాకే చెక్ పడుతుందని అంటున్నారు. మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా దీని మీద నిర్ణయం తీసుకుంటుంది అన్నది.

Tags:    

Similar News