ఏపీకి వెళ్లాల్సిందే.. ఆ ఐఏఎస్‌ల‌కు 'క్యాట్‌' ఆదేశం

క్యాట్‌ను ఆశ్ర‌యించిన వారిలో తెలంగాణలోని ఆమ్రపాలి, వాణీప్రసాద్, వాకాటి కరుణ, తెలంగాణకు కేటాయించినా ఏపీలో ప‌నిచేస్తున్న సృజన క్యాట్‌ను ఆశ్ర‌యించారు.

Update: 2024-10-15 16:42 GMT

ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి, తెలంగాణ‌కు కేటాయించిన ఐఏఎస్ , ఐపీఎస్‌ల‌లో కొంద‌రు త‌మ‌కు న‌చ్చిన రాష్ట్రాల్లో ప‌నిచేస్తున్నారు. అయితే.. అలా కుద‌ర‌ద‌ని, విభ‌జ‌న స‌మ‌యంలో కేటాయించిన రాష్ట్రానికే వెళ్లాల‌ని ఇటీవ‌ల కేంద్ర హోం శాఖ ఉత్త‌ర్వులు ఇచ్చింది. అయితే.. దీనిని స‌ద‌రు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర ప‌రిపాల‌నా ట్రైబ్యున‌ల్‌(క్యాట్‌)ను ఆశ్ర‌యించా రు. కేంద్రం ప‌రిధిలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ప‌ర్స‌న‌ల్ ట్రైనింగ్‌(డీవోపీటీ) త‌మ బ‌దిలీ విష‌యంలో ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించింద‌ని.. త‌మ వాద‌న‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోలేద‌ని స‌ద‌రు ఐఏఎస్‌లు క్యాట్ ముందు పేర్కొన్నారు.

క్యాట్‌ను ఆశ్ర‌యించిన వారిలో తెలంగాణలోని ఆమ్రపాలి, వాణీప్రసాద్, వాకాటి కరుణ, తెలంగాణకు కేటాయించినా ఏపీలో ప‌నిచేస్తున్న సృజన క్యాట్‌ను ఆశ్ర‌యించారు. డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. డీవోపీటీ ఆదేశాల మేర‌కు ఈ నెల 16(బుధ‌వారం) రిలీవ్ కావాల్సి ఉంద‌ని.. దీనిని ర‌ద్దు చేయాల‌ని కోరారు. అంతేకాదు.. డీవోపీటీ ఏక‌స‌భ్య క‌మిష‌న్ వేసి.. దాని ప్ర‌కారం నిర్ణ‌యం తీసుకుంద‌ని ఐఏఎస్‌ల త‌ర‌ఫున న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపించారు. కానీ, వాస్త‌వానికి డీవోపీటీనే నేరుగా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో డీవోపీటీ ఆదేశాలు ర‌ద్దు చేయాల‌న్నారు.

అయితే.. దీనికి క్యాట్ అంగీక‌రించ‌లేదు. కీల‌క‌మైన రెండు ప్ర‌శ్న‌ల‌ను సంధించింది. 1) డీవోపీటీ ఏక‌స‌భ్య క‌మిష‌న్ వేసిన విష‌యం తెలిసిన‌ప్పుడు.. అప్పుడే క్యాట్‌ను ఎందుకు ఆశ్ర‌యించ‌లేద‌ని ప్ర‌శ్నించింది. 2) ఏపీలో వర‌ద‌లు, విప‌త్తుల కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని మీకు లేదా? అని ఐఏఎస్ త‌ర‌ఫున న్యాయ‌వాదుల‌కు ప్ర‌శ్న‌లు సంధించింది. అయితే.. ఆయా ప్ర‌శ్న‌ల‌కు న్యాయ‌వాదులు మౌనంగా ఉండ‌డంతో.. క్యాట్ స‌ద‌రు ఐఏఎస్‌ల ద‌ర‌ఖాస్తుల‌ను తిర‌స్క‌రించింది. డీవోపీటీ ఇచ్చిన ఆదేశాల‌నే పాటించాల‌ని పేర్కొంది. దీంతో ఐఏఎస్‌ల‌కు ఊర‌ట ల‌భించ‌లేదు.

ఏం జ‌రుగుతుంది?

ఈ నెల 16న ఏపీకి చెందిన వారు తెలంగాణ నుంచి, తెలంగాణ‌కు చెందిన వారు ఏపీ నుంచి రిలీవ్ కావాల‌ని వారం కింద‌టే డీవోపీటీ ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో స‌మ‌యం మించిపోయింది. పైగా ప్ర‌భుత్వాల నుంచి కూడా పెద్ద‌గా స్పంద‌న రాలేదు. ఏపీ ప్ర‌భుత్వం అక్క‌డి నుంచి తెలంగాణ‌కు వ‌చ్చే ఐఏఎస్‌ల‌ను నిలుపుద‌ల చేస్తామ‌ని అభ‌యం ఇచ్చినా.. ఎక్క‌డా వ‌ర్క‌వుట్ అయ్యే ప‌రిస్థితి లేదు. ఇక‌, తెలంగాణ స‌ర్కారు అస‌లు ఈ విష‌యంలో జోక్యం చేసుకోలేదు. ఐపీఎస్‌లు అయితే.. బ‌దిలీకే మొగ్గు చూపుతున్నారు. వారు మాన‌సికంగా సిద్ధ‌మ‌య్యారు. దీంతో ఆయా ఐఏఎస్‌,ఐపీఎస్‌లు ఈ నెల 16న రిలీవ్ కాక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Tags:    

Similar News