ఏపీలో కూటమి టికెట్ల డిసైడ్ వెనుక బలమైన ''షా''డో?
బీజేపీ కంటే ముందే ఏపీలో టీడీపీ-జనసేన జట్టు కట్టాయి. ఆ తర్వాత బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలిసి ఆ పార్టీని కూటమిలో చేర్చుకున్నాయి
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సిగపట్లు కొనసాగుతున్నాయి. గెలిచిన ఏడాదిలోపే అధినాయకత్వంతో విభేదించిన నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణం రాజుకు టికెట్ రాకపోడంతో ఆయన తనదైన శైలిలో వీడియో విడుదల చేశారు. మరోవైపు చాలా స్థానాల్లో కూటమి సీట్ల పంచాయతీ కొనసాగుతోంది. పి.గన్నవరం నుంచి టీడీపీ తరఫున తొలుత ప్రకటించిన మహా సేన రాజేశ్ ను కాదని.. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. విజయనగరం ఎంపీ సీటును తొలుత బీజేపీ తీసుకుంది. కానీ, మళ్లీ అవగాహనకు వచ్చి టీడీపీకి వదిలేసింది. ఆ తర్వాత రాయలసీమలోని రాజంపేట ఎంపీ సీటును తీసుకుంది.
పట్టుబట్టి సీట్లు పెంచుకుని
బీజేపీ కంటే ముందే ఏపీలో టీడీపీ-జనసేన జట్టు కట్టాయి. ఆ తర్వాత బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలిసి ఆ పార్టీని కూటమిలో చేర్చుకున్నాయి. ఇక మొదట టీడీపీ-జనసేన సీట్ల అవగాహనకు వచ్చాయి. జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లు ఇచ్చింది టీడీపీ. కానీ, మూడు పార్టీలు కలిసి మాట్లాడుకున్నాక బీజేపీ కోసం జనసేన మూడు అసెంబ్లీ, ఒక లోక్ సభ సీటు త్యాగం చేసింది.
బీజేపీ 10 అసెంబ్లీ సీట్లా?
ఏపీలో ఒక శాతం బలం కూడా లేని బీజేపీకి ఏకంగా 10 అసెంబ్లీ సీట్ల ఇవ్వడం టీడీపీ-జనసేన కూటమి బలహీనతగా చెబుతున్నారు. దీంతోపాటు ఎంతటి మోదీ ప్రభావం ఉన్నప్పటికీ ఆ పార్టీకి 6 లోక్ సభ సీట్లు ఇవ్వడ కూడా ఎక్కువేనని చెబుతున్నారు. ఈ లెక్కలపై టీడీపీ వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టికెట్ డిసైడర్ ఆయనే?
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో సొంత పార్టీ టికెట్లనే కాక.. మిత్రపక్షాల నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలో కూడా బీజేపీ అగ్ర నేత ఒకరు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అగ్రనేతకు ఆయన షాడో నేత కావడంతో ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేని పరిస్థితి. కూటమిలోని ఇతర పార్టీల్లో కొందరికి టికెట్ గల్లంతు వెనుక ఆయన డిసైడింగ్ వ్యవహరించారని చెబుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంటున్నారు. ఎంపీ సీట్లలో ఎలాగూ ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తారు. కానీ, కొన్ని ఎమ్మెల్యే సీట్ల విషయంలోనూ తన మాట నెగ్గించుకోవడమే ఇక్కడ చెప్పుకోదగిన అంశం. ఎన్నికల పర్వం మరింత ముందకుసాగిన కొద్దీ ఆయన ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం..?