చీరల దొంగల్ని పట్టించిన ఏపీ డిప్యూటీ సీఎం కుమార్తె
ఆమె అక్కడ చీరలు చూస్తుండగా.. ఐదుగురు మహిళలు అక్కడికి వచ్చారు.
ఉన్నత స్థానాల్లో ఉన్న వారు.. తాము తమ హడావుడి మాత్రమే తప్పించి మిగిలిన విషయాల్ని పట్టించుకోరన్న వాదనకు భిన్నంగా ఇటీవల వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాము చూసిన అన్యాయాల్ని అడ్డుకునే ప్రయత్నాల్ని చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. తాజాగా అలాంటి ఉదంతమే ఏపీలో చోటు చేసుకుంది. ఒక షోరూంకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం కుమార్తె.. సదరు షోరూం సిబ్బంది గుర్తించని విషయాల్ని.. తాను గమనించటమే కాదు పోలీసుల్ని అలెర్టు చేసి.. దొంగల్ని పట్టించిన తీరు ఆసక్తికరంగా మారింది.
అసలేం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె క్రపాలక్ష్మీ శనివారం విజయవాడ బందర్ రోడ్ లోని ఒక చీరల దుకాణానికి వెళ్లారు. ఆమె అక్కడ చీరలు చూస్తుండగా.. ఐదుగురు మహిళలు అక్కడికి వచ్చారు. ఆ ఐదుగురు మహిళలు హడావుడి చేస్తూ.. ఖరీదైన చీరలు తమకు చూపించాలంటూ సేల్స్ సిబ్బందిని అడిగారు. ఈ క్రమంలో వారిలో నలుగురు చీరల్ని చోరీ చేశారు. ఈ విషయాన్ని అక్కడే షాపింగ్ చేస్తున్న డిప్యూటీ సీఎం కుమార్తె చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు.. సదరు చీరల షాపు ఓనర్ ఇంట్లో ఉండి.. తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్ లో షాప్ సీసీ కెమేరాల ఫుటేజ్ ను చూస్తూ.. చీరల దొంగల చేతి లాఘవాన్ని గుర్తించారు. వెంటనే సిబ్బందిని అలెర్టు చేశారు. అప్పటికే నలుగురు మహిళా చోరీమణులు జేజారి వెళ్లిపోగా.. మరో దొంగను మాత్రం డిప్యూటీ సీఎం కుమార్తె స్వయంగా పట్టుకున్నారు. ఆ దొంగను షాపు నుంచి బయటకు వెళ్లకుండా నిలువరించారు.
అంతలోనే అక్కడకు సీఐ గుణరాము వచ్చారు. సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా మిగిలిన నలుగురు దొంగల సమాచారాన్ని అందించారు. దీంతో.. వారిని అదుపులోకి తీసుకున్నారు.చీరల షాపింగ్ కు వచ్చి తన పని తాను చూసుకొని వెళ్లిపోకుండా.. చీరల దొంగల్ని పట్టించిన డిప్యూటీ సీఎం కుమార్తెను పలువురు అభినందిస్తున్నారు.