ఏపీలో ఉచిత బస్సు పథకంపై క్లారిటీ ఇచ్చేసిన ఏపీ సర్కార్
ఇలాంటి వేళ.. ఏపీ రాష్ట్ర రవాణా.. యువజన క్రీడల మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి స్పందించారు.
ఏపీలో కొత్త సర్కారు కొలువు తీరి రెండు వారాలే అయినప్పటికి.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు విషయంలో త్వర.. త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే పింఛన్ల పంపిణీ పథకాన్ని షురూ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మిగిలిన పథకాల అమలు మీదా ఫోకస్ చేస్తున్నారు. మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకం అమలు మీద ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం అమలు త్వరలోనే ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.
ఇలాంటి వేళ.. ఏపీ రాష్ట్ర రవాణా.. యువజన క్రీడల మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి స్పందించారు. తాజాగా విశాఖపట్నానికి వచ్చిన ఆయన మాట్లాడారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే పథకాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ పథకం అమలు విశాఖపట్నం నుంచే షురూ అవుతుందన్న తీపికబురును వెల్లడించారు.
ఉచిత బస్సు పథకం అమలవుతున్న కర్ణాటక.. తెలంగాణలలో ఏపీ ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేస్తున్నారని.. త్వరలోనే డేట్ వెల్లడిస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలోకి విలీనం చేయలేదని.. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి.. అవసరమైన మేరకు బస్సుల్ని పెంచుతామని స్పష్టం చేశారు. ఎలక్ట్రికల్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకొస్తామన్న ఆయన మాటలు ఉచిత బస్సు పథకం అమలుపై ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తుందని చెప్పాలి.
తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రచారం చేసిన పథకాల్లో మహాలక్ష్మి స్కీం కింద మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ సర్కారు ప్లాగ్ షిప్ కార్యక్రమాల్లో ఒకటైన దీనికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. మహిళల నుంచి సానుకూల స్పందన రావటం తెలిసిందే. అయితే.. ఈ పథకాన్ని విపక్ష బీఆర్ఎస్ వ్యతిరేకించటం తెలిసిందే.