'జగన్మాయ' అంటూనే.. చంద్రబాబు చిక్కుకు పోతున్నారే!
చంద్రబాబు వస్తే అభివృద్ది జరుగుతుందని అన్నారు. రాష్ట్రం వెలిగిపోతుందని కూడా అందరూ భావించారు. అయితే.. రాను రాను.. ఈ అబివృద్ధి మంత్రం తగ్గుతూ వచ్చింది.
''ఇదంతా జగన్మాయ.. ఎవరూ జగన్ వలలో పడొద్దు'' అని పదే పదే చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయనే జగన్మాయలో పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇది పార్టీ లైన్‌ను తప్పిస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది. చంద్రబాబు అంటే.. విజన్. డెవలప్‌మెంట్‌కు మారు పేరు. దీనిని పట్టుకునే ప్రజల్లోకి వచ్చారు. ఒక మూడు మాసాల కిందటి ప్రసంగాలు వింటే.. చంద్రబాబు అభివృద్ది మంత్రాన్నిజపించారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తానని.. హైదరాబాద్ కట్టానని చెప్పారు.
కంపెనీలను కూడా తీసుకువస్తానన్నారు. రాజధానికి ఫస్ట్ ప్రియార్టీ ఇస్తామన్నారు. ఇది ప్రజల్లోకి బాగానే వెళ్లింది. ముఖ్యంగా పట్టణ, నగర ఓటర్లను ప్రభావితం చేసింది. మెజారిటీఓటు బ్యాంకు ఉన్న విజయవా డ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అనంతపురం, గుంటూరు నగరాల్లో చంద్రబాబుకు అనుకూలంగా మేధావి వర్గం కూడా స్పందించింది. ఇదే విషయాన్ని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రచారంలోకి కూడా తెచ్చారు.
చంద్రబాబు వస్తే అభివృద్ది జరుగుతుందని అన్నారు. రాష్ట్రం వెలిగిపోతుందని కూడా అందరూ భావించారు. అయితే.. రాను రాను.. ఈ అబివృద్ధి మంత్రం తగ్గుతూ వచ్చింది. గత రెండు రోజులుగా అసలు ఈ విషయాన్నే చంద్రబాబు మరిచిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. అంతా పథకాలు, సంక్షేమంపై చంద్రబాబు దృష్టి పెట్టారు. తాను అధికారంలోకి వస్తే.. సామాజిక పింఛనును రూ.4000 ఇస్తామన్నారు. అంతేకాదు.. ఏమైందో ఏమో.. ఏప్రిల్-జూన్ వరకు(జగన్ అధికారంలో ఉన్న కాలం) రూ.1000 చొప్పున కలిపి మొత్తం జూలైలో చెల్లిస్తామని.. అప్పటి నుంచి రూ.4000 చొప్పున ఇస్తామన్నారు.
ఇక, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్‌ను రూ.6000 ఇస్తామని చెప్పారు. ఇది కనీవినీ ఎరుగని ప్రకటన. ఇక, వలంటీర్‌వ్యవస్థను కొనసాగించడమే కాకుండా.. దీనిని మరింత మెరుగు పరుస్తామన్నారు. సచివాలయాలను కూడా కొనసాగిస్తామన్నారు. సచివాలయ ఉద్యోగులకు జీతాలు పెంచే కార్యక్రమం చేస్తామన్నారు. నిజానికి దీంతో చంద్రబాబుపై ఉన్న విజన్ అనే ముద్ర వెనక్కి పోతోందనేది నిమ్మగడ్డ వంటివారి అభిప్రాయం.
ఇదే విషయాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నారు. ''వలంటీర్ వ్యవస్థ అనవసరం. దీనిపై టీడీపీ పోరాటం చేసింది. ఇప్పుడు అదే పార్టీ కొనసాగిస్తానని చెబుతోంది. ఇది సరికాదు'' అనే వాదన వినిపిస్తున్నారు. దీంతో జగన్మాయలో చంద్రబాబే చిక్కుకుంటున్నారనే చర్చ అయితే.. తెరమీదికి వచ్చింది.