మలేషియాలో మ్యాన్ హోల్ లో పడిన తెలుగు మహిళ.. రెస్క్యూ అప్ డేట్ ఇదే!
మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విజయలక్ష్మి (48) గల్లంతైంది.
మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విజయలక్ష్మి (48) గల్లంతైంది. ఫుట్ పాత్ పై అందరిలాగానే నడుచుకుంటూ వెళ్తుండగా... ఒక్కసారిగా ఆ ఫుట్ పాత్ కుంగిపోయింది.. ఫలితంగా.. సదరు మహిళ మురికికాలువలో పడి గల్లంతైంది. దీంతో... అక్కడున్న వారు దీన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
అవును... మలేషియాలోని కౌలాలంపూర్ లో ఫుట్ పాత్ పై నడుస్తుండగా ఓ మహిళ మ్యాన్ హోల్ లో పడిపోయింది. ఈ మ్యాన్ హోల్ లోతు సుమారు ఎనిమిది మీటర్లు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ సమయంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుంది. ప్రస్తుతం ఆ మహిళ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.
ఇందులో భాగంగా... మ్యాన్ హోల్ వద్ద రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే ప్రస్తుతం మ్యాన్ హోల్ లో జలప్రవాహం ఎక్కువగా ఉందని.. దీంతో ఈ ప్రవాహంలో ఆమె కొట్టుకుపోయి ఉంటారని స్థానిక పోలీసులు అంచనా వేస్తున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచీ ఈ సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది.
కాగా... కుప్పం నియోజకవర్గం లోని అనిమిగానిపల్లెకు చెందిన విజయలక్ష్మి.. మలేషియా రాజధాని కౌకాలంపూర్ లో ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రోడ్డు పక్కన వెళ్తూ ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్ లో పడిపోయారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరాతీశారు. ఇందులో భాగంగా... ఎమ్మెల్యే కంచర్ల శ్రీకాంత్ తో ఫోన్ లో మాట్లాడారు.