రాందేవ్ బాబా, బాలక్రిష్ణ అమాయకులు కాదు
పతంజలి ఆయుర్వేదిక్ సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబు, బాలక్రిష్ణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది
పతంజలి ఆయుర్వేదిక్ సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబు, బాలక్రిష్ణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కారకులయ్యారని ఆక్షేపించింది. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. రాందేవ్ బాబా, బాలక్రిష్ణ వ్యక్తిగతంగా హాజరయ్యారు.
వీరిద్దరు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. గత ఉత్తర్వుల్లో ఏం చెప్పామో తెలుసుకోలేనంత అమాయకులు కాదని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని వారికి తెలియదా అని ప్రశ్నించింది. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కోర్టు ఆదేశాలను పాటించాల్సిందే. కానీ వారి నిర్లక్ష్యమే వారికి సమస్యలు తీసుకొచ్చిందని అభిప్రాయపడింది.
జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా ఆధ్వర్యంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. నయం కాని వ్యాధులపై ప్రకటనలు ఇవ్వకూడదని తెలిసినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారంది. బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించినందునే వారికి కోర్టు నోటీసులు అందజేసింది. అల్లోపతిని తగ్గించి చూపించకూడదు. మీరు చెప్పిన క్షమాపణలను పరిశీలిస్తున్నాం.
వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వండి కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకుంటుంది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 23కు వాయిదా పడింది. వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేయడం తగదని సూచించింది. పతంజలి సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
దీనిపై విచారణ జరిపించిన న్యాయస్థానం గత ఏడాది నవంబర్ లో సంస్థను హెచ్చరించింది. అసత్య ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇవ్వొద్దని సూచించింది. అయినా వాటిని ఉల్లంఘించి వ్యాధులను నయం చేస్తామని చెబుతూ ప్రకటనలు విడుదల చేయడం జరిగింది. దీంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు ఇచ్చింది. దీంతో విచారణ జరిగి వారిని క్షమాపణలు చెప్పాలని చెప్పింది.