వైరల్ గా బర్రెలక్క ఎన్నికల అఫిడవిట్, మేనిఫెస్టో!

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఇంక మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2023-11-25 06:18 GMT

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఇంక మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. ఒక పక్క పార్టీలన్నీ ప్రచారంలో భారీ ఎత్తున దూసుకుపోతున్నాయి. మరొపక్క జాతీయస్థాయి నేతలంతా తెలంగాణలో ఉన్నారు. ఇక నామినేషన్లలో అభ్యర్థుల ఆస్తుల వివరాలు చూస్తే... దాదాపు అంతా కోటీశ్వరులూ, బడా పారీశ్రామిక వేత్తలు మొదలైనవారే ఉన్నారు! ఈ సమయంలో తన బ్యాంకు ఖాతాలో రూ.1,500, చేతిలో మరో రూ.5,000 ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌ లో పేర్కొన్న ఎమ్మెల్యే అభ్యర్థి వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

అవును... ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల్లో బలంగా వినిపిస్తున్న పేరు.. బర్రెలక్క! డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని, అందుకే గేదెలు కాస్తూ బతుకుతున్నానంటూ గతంలో వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసి గుర్తింపు తెచ్చుకున్న ఈ 26 ఏళ్ల యువతి అసలు పేరు కర్నె శిరీష. అయితే నాడు ఆమె పెట్టిన ఆ పోస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందంటూ పెద్దకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆమెను ప్రస్తుతం యూట్యూబ్‌ లో 1.66 లక్షల మంది, ఇన్‌ స్టాగ్రామ్‌ లో 5.97 లక్షల మంది, ఫేస్‌ బుక్‌ లో 1.12 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్‌ వేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. శిరీష అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా బీకాం పూర్తి చేశారు. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయడానికి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే మ్యానిఫెస్టోనూ విడుదల చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు పోరాటం చేస్తానని ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న బ‌ర్రెల‌క్క ఎన్నికల కమిషన్ కు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ వివ‌రాల మేర‌కు.. ఆమె ఆస్తులు, అప్పుల వివ‌రాల‌ను ఈసీ వెబ్‌ సైట్‌ లో పేర్కొంది. ఆ వివరాల ప్రకారం...

ప్రస్తుతం బర్రెలక్క చేతిలో ఉన్న సొమ్ము రూ.5000 కాగా.. బ్యాంకు బాల‌న్స్ రూ.1500. ఇక తల్లితండ్రులు ఇచ్చిన ఆస్తి రేకుల షెడ్ కాగా.. బీకాం చదివి నిరుద్యోగిగా ఉంటుంది. ఆమె వృత్తి.. బ‌ర్రెల పెంప‌కం. వాహనాలు, అప్పులూ ఏమీ లేవు! ఇదే సమయంలో... సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకు సంబంధించి తనపై ఒక కేసు (ఐపీసీ 505 (2)) కోర్టులో ఉన్నట్లుగా ఆమె ప్రస్తావించారు.

మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు:

బర్రెలక్క ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా నిరుద్యోగ సమస్యనే ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. తనని గెలిపిస్తే, నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని మేనిఫెస్టో లో ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో... పేదల ఇళ్ల నిర్మాణానికి కృషి, నిరుద్యోగులందరికీ భృతి ఇప్పించేందుకు కృషి, ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మాణం, ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు... అనేవి ఆమె మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు!

Tags:    

Similar News