రాయలసీమ : ఆళ్ళగడ్డలో షాక్ తప్పదా ?
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా పోటీచేయబోతున్న భూమా అఖిలప్రియకు షాక్ తప్పేట్లులేదు
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా పోటీచేయబోతున్న భూమా అఖిలప్రియకు షాక్ తప్పేట్లులేదు. మామూలుగానే అఖిలంటే నియోజకవర్గంలో చాలామందిలో వ్యతిరేకత పెరిగిపోయింది. మామూలు జనాల సంగతి పక్కనపెట్టేస్తే అసలు పార్టీలోనే చాలామంది నేతలకు భూమా అంటే ఏమాత్రం పడదు. ఇదే సమయంలో భూమా ఫ్యామిలిలో చాలామంది అఖిలకు పూర్తిగా వ్యతిరేకమయ్యారు. భూమా ఫ్యామిలీలో ఉన్న వారిలో చాలామంది ఈమధ్యనే మీటింగ్ పెట్టుకుని అఖిలప్రియకు ఎట్టిపరిస్ధితుల్లోను టికెట్ ఇవ్వద్దని ఒక లేఖ రాశారు.
ఒకవేళ అఖిలకు టికెట్ ఇస్తే ఆమె కచ్చితంగా ఓడిపోతుందని కూడా ముందుగానే జోస్యం చెప్పారు. పార్టీ నేతలనుండి వ్యతిరేకత వచ్చినా, భూమా కుటుంబం ముందుగానే హెచ్చరించినా సరే చంద్రబాబు మాత్రం అఖిలకు టికెట్ ప్రకటించేశారు. ఎంతోమంది సీనియర్లు టికెట్ కోసం వెయిట్ చేస్తుంటే అఖిలకు మాత్రం చంద్రబాబు మొదటిజాబితాలోనే టికెట్ ప్రకటించేయటం గమనార్హం. అసలు అఖిలను పార్టీలోనే ఉంచరని చాలామంది అనుకుంటున్న నేపధ్యంలో టికెట్ ప్రకటించటమే షాక్ కు గురిచేసింది.
సరే ఈ విషయాన్ని వదిలేస్తే తాజా డెవలప్మెంట్ ఏమిటంటే భూమా కిషోర్ రెడ్డి వైసీపీలో చేరారు. కిషోర్ రెడ్డి ఎవరంటే భామా నాగిరెడ్డికి అన్న కొడుకు. అఖిలకు కిషోర్ అన్నవుతాడు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేయాలని అనుకున్నారు. నియోజకవర్గంలో చాలా గట్టిగా కష్టపడుతున్నారు. భూమా కిషోర్ వల్ల అఖిల గెలుపు కష్టమనే అనుకున్నారు. అఖిల టీడీపీ తరపున పోటీచేసి, కిషోర్ బీజేపీ తరపున పోటీచేస్తే వాళ్ళమద్దతుదారుల ఓట్లన్నీ చీలిపోతాయని అందరు అనుకున్నారు.
అయితే అనూహ్యంగా భూమా కిషోర్ బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. దాంతో వైసీపీ బలం ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయినట్లయ్యింది. మామూలుగానే వైసీపీ-టీడీపీ-బీజేపీ మధ్య త్రిముఖ పోటీలో వైసీపీ గెలుపు ఖాయమని అనుకుంటున్నారు. అలాంటిది బీజేపీ నేత కిషోర్ వైసీపీలో చేరిన కారణంగా ఎంఎల్ఏ బ్రిజేంద్రనాధరెడ్డి బలం బాగా పెరిగినట్లయ్యింది. దాంతో వైసీపీ గెలుపు ఖాయమని ప్రచారం ఇపుడు బాగా పెరిగిపోయింది. అందుకనే అఖిలకు షాక్ తప్పదనే అనుకుంటున్నారు.