పవన్ పై కేసులు... కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పినట్లేనా?
ఈ నేపథ్యంలో... పవన్ కల్యాణ్ పై గతంలో నమోదైన కేసులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని!... దీనికి సంబంధించిన విచారణ హైకోర్టులో పెండింగ్ లో ఉందని లాయర్లు తెలిపారు!
గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రధానంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు సమయంలో... తెలంగాణ నుంచి బయలుదేరిన పవన్ ఏపీకి వస్తున్న క్రమంలో రోడ్డుపై కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పవన్ పై కేసు నమోదైంది!
ఇదే సమయంలో విశాఖపట్నంలోని హోటల్ లో పవన్ ఉన్న సమయంలో... పోలీసుల విధులకు ఆయన ఆటంకం కలిగించారంటూ మరో కేసు నమోదైంది! ఆ సంగతి అలా ఉంటే... గత ఏడాదిలో పవన్ నిర్వహించిన వారాహి యాత్రలో భాగంగా.. ఏపీలో మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ కి బలవుతున్నారని.. ఈ విషయంలో వాలంటీర్ల పాత్ర ఉందంటూ ఆయన చేసిన ఆరోపణల సంగతి తెలిసిందే.
అప్పట్లో ఈ ఆరోపణలు తీవ్ర దుమారం లేపాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్స్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అత్యధికంగా మహిళా వాలంటీర్లు కేసులు నమోదు చేశారు. మరోపక్క ప్రభుత్వం వాలంటీర్లకు మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో పవన్ పై నమోదైన కేసుల్లో కొన్నింటిని గుంటూరు స్థానిక కోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో.. మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది.
ఈ మేరకు గతంలో పవన్ కు రెండుసార్లు విచారణ చేసి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే... ఇటీవల ఏపీలో ప్రభుత్వం మారిపోయింది.. ఇందులో భాగంగా ఏపీలో కూటమి సర్కార్ కొలువుదీరింది. ఈ నేపథ్యంలో... పవన్ కల్యాణ్ పై గతంలో నమోదైన కేసులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని!... దీనికి సంబంధించిన విచారణ హైకోర్టులో పెండింగ్ లో ఉందని లాయర్లు తెలిపారు!
ఇదే సమయంలో... పవన్ తో పాటు పలువురిపై నమోదైన కేసులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్లు కూడా లాయర్లు గుంటూరు కోర్టుకు వెల్లడించారని తెలుస్తోంది. వీటికి సంబంధించిన పలు పత్రాలను కూడా సమర్పించారని అంటున్నారు. దీంతో... హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న అనంతరం.. తదుపరి ఉత్తర్వ్యులు ఇస్తామంటూ గుంటూరు కోర్టు పేర్కొంది.
ఈ సందర్భంగా హైకోర్టులో వాదనలు వినిపించిన ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్... నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో పలువురిపై అనేక కేసులు నమోదు చేశారని అన్నారు. వాటన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం పునఃపరిశీలించి నిర్ణయం తీసుకోబోతోందని తెలిపారు. ఈ సమయంలో వాదనలు విన్న న్యాయమూర్తి... దిగువ కోర్టులో కేసు విచారణను నాలుగు వారాలు నిపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.