అందుకే బ్రిడ్జిలు కూలిపోతున్నాయట.. కేంద్ర మంత్రి సమాధానం కేకో కేక!

బీహార్‌ లో గత కొద్ది రోజులుగా వరుసగా వంతెనలు, బ్రిడ్జిలు కుప్పకూలుతున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ పాత బ్రిడ్జిలు కాదు

Update: 2024-07-05 10:02 GMT

బీహార్‌ లో గత కొద్ది రోజులుగా వరుసగా వంతెనలు, బ్రిడ్జిలు కుప్పకూలుతున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ పాత బ్రిడ్జిలు కాదు. ఈ మధ్య కాలంలో కట్టినవే కావడం గమనార్హం. వివిధ కాలువలు, నదుల మీద కట్టిన బ్రిడ్జిలు, వంతెనలు వరుసగా కూలిపోతుండటం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారింది. దీనిపై బీహార్‌ లో ప్రతిపక్షాలు.. కాంగ్రెస్, ఆర్జేడీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ అంతా నివ్వెరపోయే సమాధానం ఇచ్చారు. 17 రోజుల వ్యవధిలోనే బీహార్‌ లో 12 బ్రిడ్జిలు కూలిపోయాయని.. దీనిపై మీ స్పందన ఏంటని మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కేంద్ర కేబినెట్‌ మంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ బిత్తరపోయే సమాధానం ఇచ్చారు. ఇది రుతుపవనాల సమయమని.. ప్రస్తుతం బీహార్‌ లో ప్రస్తుతం భీకర వర్షాలు పడుతున్నాయన్నారు. ఈ భారీ వర్షాలే బ్రిడ్జిలు కూలడానికి కారణమన్నారు. ఏది ఏమైనప్పటికీ బ్రిడ్జిల కూలిన విషయంలో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సీరియస్‌ గా ఉన్నారని తెలిపారు. దీనిపై వెంటనే దర్యాప్తు కూడా మొదలుపెట్టారని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.

దీంతో జితన్‌ రామ్‌ మాంఝీ వ్యాఖ్యలపై సెటైర్లు పడుతున్నాయి. వర్షాలకు బ్రిడ్జిలు కూలడమేంటని ఎద్దేవా చేస్తున్నారు. పెద్ద తుపానులు, గాలివానలు, ఒక మాదిరి భూకంపాలను సైతం తట్టుకునే టెక్నాలజీ ఇప్పుడు ఉందని.. అలాంటిది వానలకే బ్రిడ్జిలు కూలిపోవడం వింతగా ఉందని అంటున్నారు. నాసిరకం పనులు చేయడం, కాంట్రాక్టర్ల కక్కుర్తి, పనులను ప్రభుత్వ ఉన్నతాధికారులు పరిశీలించకపోవడమే బ్రిడ్జిలు కూలడానికి కారణమంటున్నారు.

కాగా ఇప్పటివరకు బీహార్‌ లోని శివన్, సరన్, మధుబాణి, అరారియా, ఈస్ట్‌ చంపారన్, కృష్ణ్‌ గంజ్‌ జిల్లాల్లో వంతెనలు కుప్పకూలాయి. ఓవైపు ప్రతిపక్షాలు విమర్శలు, ఇంకోవైపు జాతీయ మీడియాలోనూ ఈ అంశం వైరల్‌ కావడంతో బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఈ పరిణామాల పట్ల ఆగ్రహంగా ఉన్నారు.

రాష్ట్రంలోని అన్ని పాత వంతెనలపై సర్వే నిర్వహించి, తగిన మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వంతెనల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను తయారు చేయాలని సూచించారు. కాగా వంతెనలు కూలడానికి ఈ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు, నిర్వహణ పనులను పర్యవేక్షించే ఇంజనీర్లే కారణమని ఉన్నతాధికారుల పరిశీలనలో తేలినట్టు సమాచారం.

Tags:    

Similar News