కమలంతో గులాబీ పార్టీ కరచాలనం తప్పదా ?

రాజకీయం అంటే నిన్నటి ప్రత్యర్ధి నేడు మిత్రుడు. నేటి మిత్రుడు రేపటి శత్రువు. ఇదిలా ఉంటే దేసంలో బీజేపీ దండయాత్ర యమ జోరుగా సాగుతోంది.

Update: 2025-02-09 13:30 GMT

రాజకీయం అంటే నిన్నటి ప్రత్యర్ధి నేడు మిత్రుడు. నేటి మిత్రుడు రేపటి శత్రువు. ఇదిలా ఉంటే దేసంలో బీజేపీ దండయాత్ర యమ జోరుగా సాగుతోంది. బీజేపీ గెలిచిన చోట్ల కాదు తనకు దక్కని రాష్ట్రాలను సైతం తమ వశం చేసుకోవడానికి వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ తెలంగాణాను టార్గెట్ గా చేసుకుంది.

తెలుగు రాష్ట్రాలలో కమల వికాసానికి గేట్ వే గా తెలంగాణాను కాషాయం పార్టీ పెద్దలు చూస్తున్నారు. తెలంగాణాలోని రాజకీయ సామాజిక పరిస్థితుల నేపథ్యంలో మొదటి నుంచి బీజేపీకి కొంత మద్దతు లభిస్తోంది. ఇక చిన్న రాష్ట్రాలు అన్న నినాదం అందుకున్నది కూడా బీజేపీ దేశంలో బలపడేందుకే. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో తంతు పాత్రను ఆనాటి విపక్షంగా బీజేపీ పోషించింది.

తెలంగాణా కోసం పోరాడిన పార్టీగా రెండుసార్లు బీఆర్ఎస్ కి ప్రజలు అధికారం అప్పగించారు. ఇక తెలంగాణాను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కి కూడా ఇపుడు అవకాశం కల్పించారు మరి తెలంగాణా రాష్ట్రం కల సాకారం కావడానికి మద్దతు ఇచ్చిన కీలక పార్టీగా బీజేపీకి కూడా తప్పకుండా జనాలు చాన్స్ ఇవ్వాలన్నది కమలం పార్టీ అలోచన.

అయితే తెలంగాణాలో చూస్తే ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ బలంగా క్షేత్ర స్థాయిలో ఉంది. కాంగ్రెస్ అయితే ఉమ్మడి ఏపీ నుంచి పాలించిన పార్టీగా పటిష్టంగా ఉంది. ఈ రెండు పార్టీలతో రేసులో పోటీ పడినపుడు బీజేపీ కొంత వెనకబడుతోంది. అయితే బీజేపీ ఒక పద్ధతి ప్రకారం తెలంగాణాలో బీఆర్ఎస్ ని ఖాళీ చేయించాలని చూస్తోంది.

ఆ విధంగా కాంగ్రెస్ ని తెలంగాణా రాజకీయ చిత్రపటం నుంచి లేకుండా చేయాలని చూస్తోంది. అదే సమయంలో అవసరమైన రాజకీయ వ్యూహాలను కూడా రచిస్తోంది. ఈ నేపధ్యంలో బీజేపీ దేశంలో ఇరవైకి పైగా రాష్ట్రాలను జయించి తెలంగాణాను ఫోకస్ చేస్తోంది. దాంతో తెలంగాణాలో రాజకీయ సమీకరణలు మారే చాన్స్ ఉంది అని అంటున్నారు.

తెలంగాణాలో బీజేపీ తొలి టార్గెట్ కాంగ్రెస్ ని లేకుండా చేయడం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ఏ మాత్రం బలం లేకుండా చేయాలంటే అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి శూన్యం చేయలన్నదే బేజేపీ ఎత్తుగడ. అందుకోసం బీఆరె ఎస్ విషయంలో కాస్తా మెతక వైఖరి ప్రదర్శిస్తోంది అని అంటున్నారు. ఇటీవల కేసీఆర్ సొదరి మృతి చెందిన నేపథ్యంలో మోడీ నేరుగా కేసీఆర్ కి లేఖ రాయడం చూస్తే కమలం నుంచి ఏదో ఒక సందేశం వచ్చింది అని అంటున్నారు.

అంతే కాదు బీజేపీకి చెందిన పలువురు కేంద్ర మంత్రులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్ళి కలసిరావడం చర్చగా మారింది. ఈ మధ్యలో ఏదో జరుగుతోంది అన్నది ప్రచారంలో ఉంది. ఇక బీఆర్ఎస్ లో చూసుకుంటే మరోసారి కనుక అధికారంలోకి రాకపోతే బీఆర్ఎస్ కి రాజకీయంగా తీవ్ర సవాళ్ళు ఎదురవుతాయని అంటున్నారు.

అంతే కాదు ఒకే సమయంలో జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అలాగే తెలంగాణాలో కాంగ్రెస్ తో పోరాటం చేయడం కష్టతరంగా మారుతోంది అంటున్నారు. కాంగ్రెస్ ని గట్టిగా ఢీ కొట్టాలీ అంటే బీజేపీ సాయం తీసుకోవాల్సిందే అన్న చర్చ ఉంది. అలా కాకుండా బీజేపీతో దూరం పాటిస్తే కచ్చితంగా ఆ పార్టీ కూడా తన ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది అన్న కలవరం కూడా ఎక్కడో ఉంది అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే తెలంగాణా ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉంది. దాంతో ఇప్పటి నుంచే ఒక విధంగా సాఫ్ట్ కార్నర్ తో ముందుకు వెళ్తే ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదురుతాయన్న టాక్ ఉంది. అంతే కాదు జాతీయ రాజకీయాల్లో పాల్గొనాలన్న కేసీఆర్ కోరిక కూడా ఈ విధంగా తీర్చుకుంటారని ఆయన ఢిల్లీకి వెళ్తారని అంటున్నారు. మొత్తానికి చూస్తే తెలంగాణాలో కమలంతో కరచాలనానికి గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది అన్న చర్చ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరువాత మరింతగా పెరిగిపోతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News