ఆ రెండూ ఓడితే బీజేపీ పరిస్థితి ఏంటి ?

రెండవది హర్యానా ఎన్నికలు. ఇవి కూడా బీజేపీకి గెలవాల్సిన అనివార్యతతో కూడుకున్నవే.

Update: 2024-09-14 03:31 GMT

కేంద్రంలో మిత్రుల మద్దతుతో అధికారం చలాయిస్తున్న బీజేపీకి రెండు రాష్ట్రాల ఫలితాలు అత్యంత కీలకంగా మారబోతున్నాయా అంటే జవాబు అవును అనే వస్తోంది. అందులో ఒకటి కాశ్మీర్. సరిగ్గా అయిదేళ్ల క్రితం బీజేపీ తీసుకున్న ఒక విప్లవాత్మకమైన నిర్ణయానికి జనాలు ఇచ్చే తీర్పు ఒక రెఫరెండంగా మోడీ ప్రభుత్వానికి ఉంటుంది అని అంటున్నారు.

రెండవది హర్యానా ఎన్నికలు. ఇవి కూడా బీజేపీకి గెలవాల్సిన అనివార్యతతో కూడుకున్నవే. తమాషా ఏంటి అంటే ఈ రెండు రాష్ట్రాలలో మొత్తం అసెంబ్లీ సీట్లు చెరి 90 ఉన్నాయి. ఇందులో మ్యాజిక్ ఫిగర్ 46 మార్క్ ని బీజేపీ అందుకోవాలి.

ఇపుడున్న పరిస్థితుల్లో చూస్తే కనుక హర్యానాలో బీజేపీ గెలిచే అవకాశాలు అయితే లేవు అనే అంటున్నారు. రెండు సార్లు వరసగా అధికారం చేపట్టిన బీజేపీకి ఈసారి ప్రతిపక్షమే ఖాయం అని అంటున్నారు. అక్కడ కాంగ్రెస్ బాగా బలం పుంజుకుంది. దాంతో కాంగ్రెస్ నేతలు కూడా హర్యానా మాది అని జోస్యం చెబుతున్నారు.

జమ్మూ కాశ్మీర్ తీసుకున్నా కధ అలాగే ఉంది. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ జత కట్టింది. ఈ రెండు పార్టీల కూటమి బలంగా ఉంది. దాంతో బీజేపీకి అక్కడ అధికారం అందని పండు అవుతుందని అంటున్నారు. బీజేపీకి మిత్రులు ఎవరూ లేరు. అంతా ప్రత్యర్థులే. పైగా అందరూ 370 ఆర్టికల్ రద్దుని వ్యతిరేకించేవారే. దాంతో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తోంది.

అక్టోబర్ మొదటి వారంలో ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు వస్తాయి. ఇపుడున్న రాజకీయ చిత్రం చూస్తే బీజేపీకి ఏమంత పాజిటివ్ వైబ్స్ లేవు అని అంటున్నారు. ఒకవేళ బీజేపీ ఓడితే పరిస్థితి ఏంటి అన్నదే చర్చ. అసలే బీహారీ బాబు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మౌనంగానే తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఆయన మెల్లగా ఇండియా కూటమికి టచ్ లోకి వస్తున్నారు అని టాక్ నడుస్తోంది.

బీజేపీకి రెండు రాష్ట్రాలలో దెబ్బ పడింది అంటే నితీష్ కుమార్ తన గొంతు పెంచుతారు అని అంటున్నారు. ఆయన 2025లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కో బోతున్నారు. దాంతో బీహార్ లో కూడా మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నితీష్ పావులు చకచకా కదపవచ్చు అని అంటున్నారు.

అదే జరిగితే మాత్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనుగడకు ఇబ్బంది వస్తుందా అన్నది మరో కీలకమైన ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా ఈ రెండు రాష్ట్రాల ఫలితాల ప్రభావం కచ్చితంగా కేంద్రం మీద పడుతుంది అని అంటున్నారు. ఈ కధ ఇక్కడితో ఆగిపోదు, వరసబెట్టి మహారాష్ట్ర, జార్ఖండ్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.

అవి కూడా బీజేపీకి దెబ్బ వేస్తే అపుడు ఉంటుంది అసలైన పొలిటికల్ స్టోరీ అని ఢిల్లీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఏది ఏమైనా బీజేపీ వీక్ అవుతోంది అన్న సంకేతాలను బలంగా పంపించాలన్నది ఇండియా కూటమి ఎత్తుగడ. అదే సమయంలో ఎన్డీయే మిత్రులకు కూడా కన్ను గీటుతున్నారు. దాంతో జాతీయ రాజకీయం రసకందాయంలో పడుతోంది.

Tags:    

Similar News