'బీజేపీ పంజా'బ్..? అక్కడ ఏం చేస్తుంది?
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్. విదేశాల్లో ఖలిస్థానీ ఆందోళనలు తరచూ జరుగుతున్నాయి. ఆప్ నకు ఖలిస్థానీల మద్దతు ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
పదేళ్లుగా పోరాడి.. పాలక ప్రభుత్వాన్ని అనేక చిక్కులు పెట్టి.. చివరకు ప్రత్యర్థి పార్టీ నాయకుడిని జైల్లో పెట్టి.. ఎలాగోలా ఢిల్లీని చేజిక్కించుకుంది బీజేపీ.. మరిప్పుడు ఏం చేస్తుంది..? తన తదుపరి టార్గెట్ ఏమిటి..? ఢిల్లీ గెలుపు ఊపులో ఆప్ ను మరింత చికాకు పెడుతుందా..? ఇందులో భాగంగా పంజాబ్ పై కన్నేసిందా..? ఈ ప్రశ్నలకు ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తదుపరి టార్గెట్ అదే.. ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉంటుంది పంజాబ్. దేశ రాజధానిలో పంజాబీల ప్రభావం అధికం. ఢిల్లీలో అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ కూ విస్తరించింది. కానీ, బీజేపీకి మాత్రం ఆ అవకాశం లేకపోయింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత సిక్కుల ఊచకోత ఆరోపణలున్న కాంగ్రెస్ ను, నిన్న గాక మొన్న పుట్టిన ఆప్ ను పంజాబీలు ఆదరించారు. కానీ, బీజేపీని మాత్రం దగ్గరకు రానీయలేదు.
సరిగ్గా మూడేళ్ల కిందట 2022 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో 117 స్థానాలకు గాను ఆప్ 92 సీట్లు నెగ్గింది. బీజేపీకి రెండే సీట్లు దక్కాయి. మాజీ సీఎం అమరీందర్ సింగ్ వంటివారిని పార్టీలో చేర్చుకున్నా కాషాయ దళానికి కషాయమే దక్కింది. అయితే, ఇప్పుడు కథ వేరు. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ తన తదుపరి టార్గెట్ గా పంజాబ్ ను ఎంచుకునే అవకాశం లేకపోలేదు.
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్. విదేశాల్లో ఖలిస్థానీ ఆందోళనలు తరచూ జరుగుతున్నాయి. ఆప్ నకు ఖలిస్థానీల మద్దతు ఉందనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో పంజాబ్ లో తమ పార్టీ అధికారంలో ఉంటేనే భద్రం అనే భావనను బీజేపీ ప్రచారంలోకి తెచ్చే చాన్సుంది.
ఆప్ ను చీల్చి.. పంజాబ్ లో తిరుగులేని మెజారిటీలో ఉన్నందున ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టడం బీజేపీకి కష్టమే. అయితే, ఆ పార్టీలో అసమ్మతులను పోగేసి.. వారిని బయటకు లాగి సర్కారును కూల్చేందుకు ప్రయత్నించవచ్చనేది రాజకీయ విశ్లేషకుల మాట.
పంజాబ్ లో 2027 లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే మరొక్క రెండేళ్లే. ఒకవేళ ఆప్ ప్రభుత్వాన్ని కూల్చకున్నా.. అస్థిరపరిచి చికాకు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేయొచ్చు. తద్వారా వచ్చే ఎన్నికల్లో గెలుపునకు బాట వేసుకుంటుంది.