ముందుంది ముసళ్ల పండుగ.. బీజేపీకి టఫ్ కాంపిటిషన్

ఇప్పటికే గత పార్లమెంట్ ఎన్నికల్లో చేదు ఫలితాలను చూసిన బీజేపీకి.. నిన్నటి రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కొంచెం ఖేదం..

Update: 2024-10-09 14:30 GMT

ఇప్పటికే గత పార్లమెంట్ ఎన్నికల్లో చేదు ఫలితాలను చూసిన బీజేపీకి.. నిన్నటి రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కొంచెం ఖేదం.. కొంచెం మోదం అన్నట్లుగా మిగిల్చాయి. పార్లమెంట్ ఫలితాల్లో 400+ సీట్లు సాధించి తీరుతామని బీజేపీ నేతలు ప్రచారం చేసుకున్నప్పటికీ ఆ స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. చివరకు మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన దుస్థితి వచ్చింది.

అయితే.. నిన్నటి హర్యానా, జమ్మూకశ్మీర్ ఫలితాల్లోనూ బీజేపీకి అనూహ్య ఫలితాలు వచ్చాయి. హర్యానాలో కాంగ్రెస్ గెలుపు గ్యారంటీ అని అన్ని సర్వేలు చెప్పాయి. కానీ.. బీజేపీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. దాంతో హర్యానా రాష్ట్రంలో బీజేపీ సంబరాలు మిన్నంటాయి. కానీ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న జమ్మూకశ్మీర్‌లో మాత్రం బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. కారణాలు ఏవైనా బీజేపీకి జమ్మూకశ్మీర్ ప్రజలు ఝలక్ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ముస్లింమైనార్టీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదనేది అందరికీ తెలిసిందే.

రెండు రాష్ట్రాలను టార్గెట్ చేసిన బీజేపీ ప్రచారంలో మహామహులను దింపింది. ఇతర రాష్ట్రాల నుంచి వాక్చతూర్యం ఉన్న వారిని రంగంలోకి తీసుకొచ్చింది. ఒక్కొక్కరు పోటాపోటీగా ప్రచారం చేశారు. కానీ.. జమ్మూకశ్మీర్‌లో వారి హవా కనిపించలేదు. అయితే.. వచ్చే ఏడాది మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ గెలిచి తీరుతామన్న బీజేపీకి.. ఒక రాష్ట్రం చేదు ఫలితాలనిచ్చింది. మరి రాబోయే నాలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వచ్చే ఏడాది మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే.. ఈ రాష్ట్రాల్లో బీజేపీ మీద పలు ఆరోపణలు ఉన్నాయి. అధికార దుర్వినియోగం, అతి రాజకీయం అనే అపవాదు ఆ పార్టీని ఎదుర్కొంటోంది. మరోవైపు.. దేశ రాజధాని అయిన ఢిల్లీలో బీజేపీ గెలిచి చాలా ఏళ్లు అయింది. ఇదే క్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి జైలులో వేశారు. దాంతో ఆ బీజేపీ మరోసారి వ్యతిరేకతను ముూటగట్టుకున్నట్లు అయింది. మొన్నటి దాక అనుకూలంగా ఉన్న పరిస్థితులు కేజ్రీవాల్ అరెస్టుతో భిన్నంగా మారాయని టాక్.

ఇక మహారాష్ట్రకు వచ్చేసరికి శివసేన, ఎన్సీపీలను బీజేపీ చీల్చింది. వారి మధ్య రాజకీయ పొగ బెట్టి ఎంత నష్టం చేసిందో అందరికీ తెలిసిందే. బిహార్ విషయంలోనూ బీజేపీ టెన్షన్ తప్పడం లేదు. నితీష్ కుమార్ ఇప్పుడు బీజేపీతోనే ఉన్నప్పటికీ.. ఎప్పుడు ఎలాంటి బాంబు పేలుస్తాడా అనే ఉత్కంఠ మాత్రం బీజేపీలో కనిపిస్తోంది. మరోవపు.. జార్హండ్‌లో హేమంత్ సోరెస్ట్ వ్యవహారం కూడా పెద్ద దుమారం రేగింది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీకి అనుకూల పవనాలు లేవు. రాజకీయంగా పలుకుబడిని కోల్పోవడం.. పార్టీల మధ్య చిచ్చు రాజేశారనే విమర్శలు ఉండడంతో.. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది పలువురు అనాలసిస్టులు ముందే ఊహిస్తున్నారు. ఒకవేళ ఈ నాలుగు రాష్ట్రాల్లో కనుక బీజేపీ మరింత డీలా పడితే భవిష్యత్తులో కేంద్రంలో ఎదుర్కోబోయే పరిస్థితులను కూడా హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News