బీఆర్ ఎస్ అవినీతిపై విచార‌ణ‌కు క‌మిటీ: బీజేపీ ఎన్నిక‌ల మేనిఫెస్టో

అదేస‌మ‌యంలో కీల‌క‌మైన ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను(4శాతం) తాము అధికారంలోకి రాగానేర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Update: 2023-11-19 02:06 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాడో పేడో తేల్చుకునేందుకురెడీ అయిన బీజేపీ.. తాజాగా పార్టీ అగ్ర‌నేత‌, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. దీనిలో కీల‌కంగా.. బీఆర్ ఎస్ స‌ర్కారు అవినీతిపై విచార‌ణ‌కుక‌మిటీ ఏర్పాటు చేస్తామ‌ని.. వ‌చ్చే ఆరు మాసాల్లోనే అవినీతిని బ‌య‌ట పెట్టి.. నేర‌స్తుల‌ను జైలు పాలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, ప్ర‌తి నెలా 1నే జీతాలు ఇస్తామంటూ.. ఉద్యోగుల‌కు భారీ ఆఫ‌ర్ ఇచ్చారు. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను(4శాతం) తాము అధికారంలోకి రాగానేర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. `సకల జనుల సౌభాగ్య తెలంగాణ` పేరుతో ఈ మేనిఫెస్టోను రూపొందించిన‌ట్టు ఆయ‌న చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణను ప్రగతిపథంలో నడిపేందుకు 10 అంశాల కార్యాచరణను ప్రకటించారు. వీటిలో ప్ర‌ధానంగా ఉమ్మ‌డి పౌర‌స్మృతి ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ధరణి స్థానంలో మీ భూమి యాప్‌, గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు, ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు, బీఆర్ఎస్ పార్టీ అవినీతిపై విచారణకు కమిటీ, 4 శాతం ముస్లింల రిజర్వేషన్ల రద్దు వంటివి ఉన్నాయి.

అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాకు కమిటీ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఎస్సీల వర్గీకరణకు సహకారం అందిస్తామ‌న్నారు.(ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ ఎంఆర్ పీఎస్ స‌భ‌లో ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్రాధాన్యం), అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్త‌మ‌ని బీజేపీ పేర్కొంది. అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు, ఎరువులు, విత్తనాల కొనుగోలుకు రూ.2,500 సాయం అందిస్తారు. (ఇది పీఎం కిసాన్ ప‌థ‌కానికి అనుబంధం), వరికి రూ.3,100 మద్దతు ధర, పాడి రైతులకు ఉచితంగా దేశీయ ఆవుల పంపిణీ, నిజామాబాద్‌లో టర్మరిక్‌ సిటీ(ప‌సుపు బోర్డు కాదు.. న‌గ‌రం) అభివృద్ధి, డిగ్రీ, ప్రొఫెషనల్‌ విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తామ‌ని బీజేపీ ప్ర‌క‌టించింది. అదేవిధంగా నవజాత బాలికలకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(అయితే..ఎంత‌నేది తొలి కేబినెట్‌లో నిర్ణ‌యించ‌నున్న‌ట్టు షా పేర్కొన్నారు.), ఉజ్వల పథకం లబ్ధిదారులకు 4 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించ‌నున్నారు.

Tags:    

Similar News