బీజేపీలో సన్మానాల చిచ్చు !

బక్రీద్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో గోవధకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసి హిందూ సమాజాన్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది.

Update: 2024-06-18 05:40 GMT

నాలుగు లోక్ సభ స్థానాల నుండి ఎనిమిది లోక్ సభ స్థానాలు, మూడు శాసనసభ స్థానాల నుండి ఎనిమిది శాసనసభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ పార్టీ ఇక తెలంగాణలో పాగా వేస్తామన్న ఆశతో దూకుడుగా ఉంది. బక్రీద్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో గోవధకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసి హిందూ సమాజాన్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అయితే తెలంగాణ నుండి ఎంపీలుగా గెలిచిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు సన్మానం చేయాలన్న ఆలోచన తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తున్నది.

కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో బేగంపేట్‌ ఎయిర్‌ పోర్టు నుంచి పార్టీ కార్యాలయం దాకా వారిని ఊరేగింపుగా తీసుకురావాలని నిర్ణయించారు. ఈ నిర్ణయమే పార్టీలో విభేదాలకు దారితీసినట్లు తెలుస్తున్నది. తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డి వర్గం, బండి సంజయ్ వర్గంతో పాటు రాజాసింగ్ ది ఒక దారి, ఈటెల రాజేందర్ ది ఒక దారి అయితే ధర్మపురి అరవింద్ ది కూడా ఇంకో దారి.

ఈ నేపథ్యంలో కేవలం కేంద్ర మంత్రులకే సన్మానం ఎందుకు ? రాష్ట్రం నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలందరికీ, ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు సన్మానం చేస్తే బాగుంటుంది కదా అన్న వాదన మొదలయింది. బీజేపీ నుంచి అరవింద్ రెండో సారి గెలిచాడు. సీనియర్ రాజకీయ నాయకురాలు, మాజీ మంత్రి అయిన డీకె అరుణ ఉంది. రెండు సార్లు మంత్రిగా చేసి. బీజేపీ నుండి ఒక సారి ఎమ్మెల్యే, ప్రస్తుతం భారీ మెజారిటీతో గెలిచిన ఈటెల రాజేందర్ ఉన్నాడు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండో సారి ఎంపీ. ఒకసారి ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు ఉన్నాడు. 2014 నుండి రాజాసింగ్ వరసగా మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇంత మంది ఉండగా ఇద్దరికే సన్మానం పేరుతో పెద్ద పీట ఎందుకు ? గెలిచిన అందరినీ సన్మానించుకుని సమిష్టిగా ముందుకు సాగితే పార్టీకి భవిష్యత్ ఉంటుంది. అలా కాదని ఇలాంటి పోకడలు పోతే ఈ విజయాలు తాత్కాలికమే అవుతాయన్నది కార్యకర్తల వాదన.

Tags:    

Similar News