బాబు ఆరోగ్యంపై వైద్యుల నివేదిక...చర్మ సమస్యపై కీలక అంశాలు వెల్లడి!

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడికి ఆరోగ్యం బాగోలేదని కొత్త డ్రామా ఆడుతున్నారని ఏపీ మంత్రి బొత్స ఆరోపించారు.

Update: 2023-10-14 12:14 GMT

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై నెల రోజులు దాటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై రెండు మూడు రోజులుగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అది స్కిన్ సమస్య అని జైలు అధికారులు, వైద్యులు చెబుతుంటే... ప్రాణహాని ఉందంటూ టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక బయటకు వచ్చిందని తెలుస్తుంది.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకు స్కిన్ అలర్జీ ఉందని గురువారం సాయంత్రం ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు రాజమండ్రి జీజీహెచ్ వైద్యులను పిలిపించి వైద్యం చేయించి మందులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు డేర్మటాలజీ సమస్య ఎక్కువగా ఉందని డాక్టర్లు నివేదికలో వెల్లడించారు. చంద్రబాబు గడ్డంపై, అరచేతిల్లో, ఛాతి భాగంలో, శరీరంలోని పలు భాగాల్లో దద్దుర్లు ఉన్నాయని నివేదికలో తెలిపారని తెలుస్తుంది.

మరోవైపు ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం వైద్యులు మెకనాజల్ రిఫర్ చేశారని తెలుస్తుంది. అదేవిధంగా అరచేతుల కోసం మార్చురెక్స్ సాఫ్ట్ క్రీం రిఫర్ చేశారని.. అలాగే అలెర్జీ కోసం టెక్జిన్ రిఫర్ చేశారని.. ఇమ్యూనిటీ పెంపు కోసం లిమ్సీ ట్యాబ్లెట్స్ రిఫర్ చేశారని తెలుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు చర్మం పలుప్రాంతాల్లో రంగుమారినట్లుగా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నివేదిక వెల్లడించిందని అంటున్నారు.

ఇదే సమయంలో ఎండల కారణంగా బాబు డిహైడ్రేషన్‌ తో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని చెప్పిన వైద్యులు... చర్మ సమస్యలు మళ్లీ రాకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారని ఆ నివేదికలో ఉందని తెలుస్తుంది.

మరోపక్క రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల నివేదిక ప్రకారం చంద్రబాబుకు ఆరోగ్యసమస్యలు తీవ్రంగా ఉన్నట్టు ఆయన వ్యక్తిగత వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తీవ్రమైన ఎండల కారణంగా కొద్ది రోజులుగా డీహైడ్రేషన్‌ తో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని వారు అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబుకి హైపర్‌ ట్రోపిక్‌ కార్డియో మైయోపతి సమస్య ఉందని చెబుతున్నారు.

ఇదొక డ్రామా అంటున్న బొత్స!:

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడికి ఆరోగ్యం బాగోలేదని కొత్త డ్రామా ఆడుతున్నారని ఏపీ మంత్రి బొత్స ఆరోపించారు. చంద్రబాబుకు నిజంగా అనారోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులకు అనిపిస్తే కోర్టుకు విన్నవించుకోవాలని సూచించారు. ఇంతాకాలం చంద్రబాబు జిమ్మిక్కులతో నెట్టుకొచ్చారని.. కానీ, ఈసారి ఆధారాలతో దొరికిపోయారని తెలిపారు.

అనంతరం... "చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాం.. ఆయనకు అనారోగ్యంగా ఉంటే కోర్టులో ఎందుకు పిటిషన్‌ వేయలేదు?.. జిమ్మిక్కులు చేస్తే నష్టపోయేది టీడీపీయే" అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

Full View
Tags:    

Similar News