ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స
ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సీనియర్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక అయిపోయారు
ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సీనియర్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక అయిపోయారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన షఫీ విత్ డ్రా చేసుకోవడంతో బొత్స ఒక్కరే మిగిలారు. దాంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే ఇది అధికారికంగా ఎన్నికల సంఘం గురువారం ప్రకటించనుంది.
ఇదిలా ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన షఫీగా వైసీపీ నేతలు ఎడతెరిపి లేని చర్చలు జరిపి ఆయనను రాజీకి తెచ్చారని అంటున్నారు. దాంతో వైసీపీ పెద్దల మాటలకు అంగీకరించి షఫీ బుధవారం తన నామినేషన్ ని ఉప సంహరించుకున్నారు.
దీంతో బొత్స వర్గం ఊపిరి పీల్చుకుంది. నిజానికి ఇద్దరు అభ్యర్థులు ఉంటే కనుక ఈ నెల 30న పోలింగ్ నిర్వహించాల్సి వచ్చేది. కానీ ఇపుడు బొత్స ఒక్కరే రంగంలో ఉన్నారు. మరో వైపు టీడీపీ కూటమి పోటీ చేయకపోవడం బొత్సకు నెత్తిన పాలు పోసినట్లు అయింది.
లేకపోతే క్యాంప్ రాజకీయాలు పెద్ద ఎత్తున సాగేవి. ఏకంగా ముప్పై కోట్ల దాకా సొమ్ము కూడా ఖర్చు అయ్యేది అని అంటున్నారు. ఇపుడు పెద్దగా ఆయాసం పడకుండానే బొత్స పెద్దల సభలో అడుగు పెట్టనున్నారు. ఆ విధంగా బొత్స పెద్దరికం నిలబడింది అని అంటున్నారు.
బొత్స పదవీకాలం 2027 డిసెంబర్ 8 దాకా ఉండనుంది. అంటే మరో మూడేళ్ల నాలుగు నెలలు అన్న మాట. గట్టిగా నలభై నేలల పదవీ కాలం చేతిలో ఉండడంతో బొత్స మళ్లీ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పడానికి అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు.