వైసీపీ రాజకీయ జాతకాన్ని మార్చనున్న బొత్స ?

రాజకీయాల్లో ఎపుడూ అవకాశాలదే పై చేయి. అవే ఎవరిని అయినా ముందుకు నడిపిస్తాయి.

Update: 2024-08-14 20:30 GMT

రాజకీయాల్లో ఎపుడూ అవకాశాలదే పై చేయి. అవే ఎవరిని అయినా ముందుకు నడిపిస్తాయి. వాటిని బట్టే రాజకీయ నేతల ఆలోచనలు మారిపోతూంటాయి. రక్త సంబంధీకులు సైతం పరస్పరం ఎదురు నిలిచి కత్తులు దూసుకునే రాజకీయ కాలం ఇది. అందువల్ల ఎవరినీ నమ్మాల్సిన పని అయితే లేదు.

ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రాలో దిగ్గజ నేత, సీనియర్ మోస్ట్ లీడర్, బీసీల ప్రతినిధిగా ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా నెగ్గారు. ఆయన సక్సెస్ ఫుల్ గా శాసనమండలిలో అడుగుపెడుతున్నారు. ఆయనను ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత ఎంపిక చేయడం వ్యూహాత్మకం. అక్కడ అధినేత జగన్ రాజకీయ చాతుర్యం బయటపడింది.

నిజానికి బొత్స వంటి సీనియర్ ఒక ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ పడడం అంటే అంతా మొదట ఆశ్చర్యపోయారు. జగన్ అయితే ఆయనను ఎంపిక చేస్తేనే నెగ్గుకుని రాగలమని భావించారు. చివరికి జగన్ ఆలోచనలే నిజం అయ్యాయి. బొత్స వంటి బిగ్ ఫిగర్ వైసీపీ నుంచి పోటీలో ఉండడం వల్లనే కూటమి కూడా తటపటాయించింది అని అంటున్నారు. బొత్స అంగబలం అర్ధబలం ప్రత్యర్ధులకు ఎరుకే అని అంటున్నారు.

టీడీపీ కూటమి కనుక పోటీలో నిలబడితే కోట్లాది రూపాయల వ్యయంతో కూడుకున్న ఎన్నికగా ఇది మారేది. మరి అంతటి తాహతు ఎవరికి వైసీపీలో ఉంది అన్న ప్రశ్నలు కూడా ఉండనే ఉన్నాయి. దానికి తోడు బొత్సకు ఉన్న పరిచయాలు ఆయన రాజకీయ ఎత్తులు అన్నీ కూడా వైసీపీకి కలసివస్తాయని భావనతోనే జగన్ ఆయన పేరు ప్రకటించారు. అనుకున్నది చివరికి సాధించారు.

సరే ఇపుడు బొత్స కేవలం ఎమ్మెల్సీగానే ఉంటారా అంటే అబ్బే కుదరదు అని అంటున్నారు. జగన్ ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి పెట్టినప్పుడే బొత్స కండిషన్లు పెట్టారని ప్రచారం సాగింది. దాని ప్రకారం బొత్సకు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాల్సి ఉంటుంది.

అంటే ఇది కేబినెట్ ర్యాంక్ పదవి. ఒక విధంగా చూస్తే జగన్ ప్రస్తుతం ఉన్న స్థితి కంటే పెద్ద పదవి. వైసీపీలో పెద్ద పదవిలో బొత్స ఉంటే జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం శాసనమండలిలో లేళ్ల అప్పిరెడ్డి వైసీపీకి అపొజిషన్ లీడర్ గా ఉన్నారు. ఆయన తొలిసారి ఎమ్మెల్సీ. రాజకీయంగా బొత్స తో పోలిస్తే అనుభవం తక్కువ. జగన్ కి నమ్మిన బంటు.

ఆయన ఈ కీలకమైన పదవిలో ఉన్నా ఫరవాలేదు కానీ బొత్స ఉంటే మాత్రం వైసీపీకి లాభమెంత అదే సమయంలో ఇబ్బందులు ఏమైనా ఫ్యూచర్ లో వస్తాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే బొత్స సీనియర్ మోస్ట్ లీడర్. తృటిలో ఆయనకు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి పదవి అవకాశం తప్పింది. అయినా దానితో సమానమైన పీసీసీ చీఫ్ గా ఆయన వ్యవహరించారు.

ఇక ఆయనది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. ఉత్తరాంధ్రాలో బలమైన సామాజిక పునాది ఉన్న వారు. ఆయనకు అన్ని రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనను వైసీపీ మండలిలో విపక్ష నేతగా చేస్తే ఆయన గట్టిగా వైసీపీ తరఫున వాదించగలరు. కూటమిని ఇరుకున పెట్టగలరు. ఇది వైసీపీకి రాజకీయంగా లాభం.

అదే సమయంలో ఆయన వేరే విధంగా వ్యవహరించినా కూటమితో సఖ్యత ప్రదర్శించినా అది వైసీపీకి తలకాయ నొప్పిగా ఉంటుంది అని అంటున్నారు. శాసనమండలిలో టీడీపీ కూటమికి మెజారిటీ లేదు. మరి ఈ అవకాశం తీసుకుని శాసన మండలి లో వైసీపీలో పెద్ద చీలికను కూటమి తేవాలని చూస్తోంది. బొత్స ఈ కీలక సమయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది.

బొత్స మీద కూటమి కన్ను పడితే మాత్రం ఆయన స్టాండ్ ఏ వైపున ఉంటుంది అన్నది కూడా ఆలోచించాల్సిందే అని అంటున్నారు. మరో వైపు ఏపీ మీద కాంగ్రెస్ కూడా కన్నేసింది. బొత్స వంటి సీనియర్ లీడర్ ని తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. కేవలం బొత్స ఒక్కరూ వస్తే లాభం లేదు. ఆయన వెంట దండీగా నాయకులు కూడా వస్తే ఏపీ పీసీసీ కిరీటం కూడా బొత్సకు పెడతారు అని ప్రచారం సాగుతోంది.

నిజానికి ఇవన్నీ పుకారులుగానే ఉన్నాయి. ఏది ఏమైనా బొత్స రాజకీయంగా తెలివైన వారు అన్నది అంతా అంగీకరించాల్సిన విషయం. వైసీపీ ఇపుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ నేపధ్యంలో పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఆయన వాడుకుని వైసీపీకి మంచి రాజకీయ ఆయుధం అవుతారా లేక ప్రత్యర్థి పార్టీల వ్యూహాలలో చిక్కుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి బొత్స పెద్దల సభకు రావడం ద్వారా వైసీపీ రాజకీయ జాతకాన్ని మాత్రం కచ్చితంగా మారుస్తారు అని అంటున్నారు. అది అనుకూలమా లేక ప్రతికూలమా అన్నది కాలం చెప్పాల్సిన జవాబు.

Tags:    

Similar News