బ్రాహ్మణి ఇస్తున్న తొలి పిలుపు...మోతెక్కిపోతుందా..?
అయిదు కోట్ల మంది ప్రజలంతా ఒక్కటిగా నిలిచి సెప్టెంబర్ 30న రాత్రి ఏడు గంటల నుంచి అయిదు నిముషాల పాటు మోత మోగించి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిగ్ సౌండ్ చేయాలని ఆమె కోరుతున్నారు.
మోత మోగిద్దాం రండి అంటూ టీడీపీ నవ సారధిగా మారబోతున్న నారా బ్రాహ్మణి ఏపీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. అయిదు కోట్ల మంది ప్రజలంతా ఒక్కటిగా నిలిచి సెప్టెంబర్ 30న రాత్రి ఏడు గంటల నుంచి అయిదు నిముషాల పాటు మోత మోగించి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిగ్ సౌండ్ చేయాలని ఆమె కోరుతున్నారు.
చంద్రబాబు అరెస్ట్, జైలు జీవితం నేపధ్యంలో టీడీపీ తలకెత్తుకున్న అతి పెద్ద కార్యక్రమం ఇది. నిజం చెప్పాలంటే చంద్రబాబు అధినేతగా ఉంటూ కూడా ఇంతలా ఇచ్చిన ప్రోగ్రాం అయితే లేదు. ఆయన టీడీపీ క్యాడర్ తో పాటు సానుభూతిపరులతోనే మీటింగ్స్ జిల్లాలలో నిర్వహించేవారు. లోకేష్ పాదయాత్ర ఆ పార్టీ వారితో పాటు జనసమీకరణతో సాగేది.
కానీ అయిదు కోట్ల మందిని టార్గెట్ గా చేసుకుంటూ ఏపీలో ఒక్కసారిగా అంతా కదలి వచ్చేలా అందరూ సంఘీభావం తెలిపేలా మోత మోగిద్దాం అంటూ ఇస్తున్న ఈ పిలుపు టీడీపీ చంద్రబాబు అరెస్ట్ తరువాత చేస్తున్న ఆందోళనలలో మేలి మలుపుగానే చూడాలి. మరి దీనికి ఎంత వరకూ స్పందన ప్రజల నుంచి వస్తుందో చూడాల్సిందే.
నిజం చెప్పాలంటే ఏపీ రాజకీయనా కూడా చీలిపోయింది. గతంలో ఎపుడూ ఇంతలా లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థ వచ్చాక ప్రతీ ఇంటితోనే నేరుగా ప్రభుత్వానికి కనెక్షన్ ఏర్పడింది. దాంతో అయిదు కోట్ల మందికి ప్రభుత్వ కార్యక్రమాలు అందించడం ద్వారా ప్రభుత్వం వారితో అను నిత్యం అనుసంధానం అవుతోంది.
ఇక ఏది తమ ఓటో ఏది వ్యతిరేక ఓటో అన్న నిఘా వ్యవస్థ కూడా వైసీపీ దగ్గర ఉందని అంటారు. విపక్షాల ఆందోళనలు గతంలో మాదిరిగా సక్సెస్ కాకపోవడానికి ప్రభుత్వ పధకాలు ఒక వైపు ఉంటే రాజకీయాలు మనకెందుకు అన్న ధోరణిలో జనాలు ఉంటూ తమ ఫలితాలు పధకాల గురించే ఆలోచిస్తున్నారు అని కూడా ఉంది. ఈ నేపధ్యంలో అయిదు కోట్ల ఆంధ్రులు ఒకక్టిగా వచ్చి గంట మోగించాలని బ్రాహ్మణి ఇచ్చిన పిలుపు పార్టీ కార్యక్రమంగా మిగిలిపోతుందా లేక తటస్థ జనాలు కూడా వచ్చి మోత మోగిస్తారా అన్నది చూడాలి.
ఇక ఆ టైం లో ఆఫీసులో ఉంటే అక్కడ నుచే ఒక పళ్లెం కానీ మరేదైనా తీసుకుని మోగించాలని సూచిస్తున్నారు. అలాగే రోడ్డు మీద ఉంటే హారన్ మోతను అయిదు నిముషాలు మోగించాలని కోరుతున్నారు. అలాగే విజిల్స్ వేయమంటున్నారు. ఎవరికి వీలైన పద్ధతిలో వారు అలా సౌండ్ చేసి వాటిని సెల్ఫీలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కూడా సూచిస్తున్నారు టీడీపీ నాయకులు మొత్తానికి చూస్తే ఈ ప్రోగ్రాం ద్వారా టీడీపీ పట్ల న్యూట్రల్ జనాలలో రియాక్షన్ ఎలా ఉందో తెలుస్తుంది అని అంటున్నారు.
ఇక నియంత మత్తు వదిలిద్దాం అని ఆయన ఇస్తున్న పిలుపు టీడీపీ వారిలో కొత్త జోష్ నింపేలా ఉంది అని అంటున్నారు. కానీ మొత్తం అయిదు కోట్ల మందికి ఎంతవరకూ రీచ్ అవుతుందన్నది చూడాలి. సో ఏది ఏమైనా గడచిన ఇరవై రోజుల గందరగోళం నుంచి మేలుకుని పార్టీ ఇస్తున్న ప్రోగ్రాం గానే దీన్ని చూడాలని అంటున్నారు.