కేకే ఫ్యామిలీకి కేసీఆర్ మరీ ఇంతలా ఓకే?

చట్టం అందరికి సమానమే. రాజు అయినా సామాన్యుడైనా చట్టం ముందు అందరూ సమానమే. మాటలు చెప్పేటప్పుడు ఇలానే చెబుతున్నా.. వాస్తవం మాత్రం వేరుగా ఉందన్న విషయం తెలిసిందే.

Update: 2023-07-16 04:42 GMT

చట్టం అందరికి సమానమే. రాజు అయినా సామాన్యుడైనా చట్టం ముందు అందరూ సమానమే. మాటలు చెప్పేటప్పుడు ఇలానే చెబుతున్నా.. వాస్తవం మాత్రం వేరుగా ఉందన్న విషయం తెలిసిందే. సామాన్యుడి విషయంలో చట్టాలు.. ప్రభుత్వాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా అధికారపక్షానికి చెందిన వారి విషయంలో ఎంత ఉదారంగా వ్యవహరిస్తాయన్న దానికి నిదర్శనంగా తాజా ఉదంతం వెలుగు చూసింది. రూ.30కోట్లకు పైనే విలువైన భూమిని రెగ్యులరైజ్ చేసే విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం దాదాపు రూ.10కోట్ల మేర కట్టాల్సి ఉంటే.. అందుకు భిన్నంగా కేవలం రూ.5.5 లక్షలకే రెగ్యులరైజ్ చేస్తూ.. కేసీఆర్ సర్కారు జారీ చేసిన రహస్య జీవో యవ్వారం తాజాగా వెలుగు చూసింది. సంచలనంగా మారింది. ఒక ప్రముఖ మీడియా సంస్థ బయటపెట్టిన ఈ ఉదంతం కేసీఆర్ సర్కారు డొల్లతనాన్ని.. తమకు కావాల్సిన వారికి ఏమైనా చేయటానికి సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును బయటపెట్టేసింది.

షాకింగ్ సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్ కె.కేశవరావు కుటుంబ సభ్యులు గతంలో తాము ఆక్రమించిన భూమి బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12లో ఉంది. రూ.30కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిని కేవలం రూ.5.5 లక్షలకే క్రమబద్ధీకరించుకున్నారు. ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములకు జీవో నంబరు 59 ప్రకారం నిర్ణీత ధర చెల్లించాల్సిందేనంటూ జీవో నెంబరు 59ను గతంలోనే జారీ చేశారు.

ఈ జీవో ప్రకారం చూసినా.. దాదాపు రూ.10కోట్లకు పైనే క్రమబద్ధీకరణ సొమ్ముల్ని ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. అయితే.. ప్రభుత్వం జారీ చేసిన జీవో 59ను తుంగలోకి తొక్కేసి.. మరో చీకటి జీవోను రహస్యంగా జారీ చేశారు. ఇటీవల జారీ చేసిన జీవో నెంబరు 56 స్పెషల్ జీవో ఆధారంగా కేవలం రూ.5.5లక్షలు కడితే చాలు క్రమబద్ధీకరణ పూర్తి అవుతుందని తేల్చేశారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12కు వెనుక ఉండే ఎన్ బీటీ నగర్ లో సుమారు 2500 గజాల ప్రభుత్వ స్థలం ఉంది. అది కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన స్వాధీనంలోకి వెళ్లింది. అందులో కొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. మిగిలిన 1586 గజాల్లో కుమార్తె విజయలక్ష్మికి 425 గజాలు.. కొడుకు 1161 గజాలు పంచి ఇచ్చారు. వారు కూడా ఆ స్థలాల్లో కొంత ఇళ్లు కట్టుకొని.. మరికొంత ఖాళీగా ఉంచారు. తాము ఆక్రమించిన ప్రభుత్వ స్థలాల్ని క్రమబద్ధీకరించుకొని.. రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి తెలంగాణ సర్కారు అవకాశం కల్పించటంతో కేకే కుమార్తె.. కుమారుడు కొన్నాళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో 59 నిబంధనల ప్రకారం 425 గజాల స్థలానికి ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పేర్కొన్న విలువలో 50 శాతం రుసుముగా వసూలు చేయాలి. ఎన్ బీటీ నగర్ లో మార్కెట్ విలువ రూ.73,200 ఉంది. అంటే.. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.1.55 కోట్ల రుసుము మేయర్ గద్వాల విజయలక్ష్మి చెల్లించాలి. అలానే కేకే తనయుడు రూ.8.49 కోట్లు చెల్లించాలి. అంటే..రెండు స్థలాలు కలిపి రెగ్యులరైజ్ చేయటం కోసం వారిద్దరూ చెల్లించాల్సింది రూ.10.04 కోట్లు. కానీ.. వారు చెల్లించింది మాత్రం అక్షరాల రూ.5.5 లక్షలు మాత్రమే. అంటే.. గజానికి రూ.350 చొప్పున చెల్లించారు. సామాన్యులైతే.. గజానికి రూ.36,600 చెల్లించాలి.

ఇదే ప్రాంతానికి చెందిన గాయత్రి హిల్స్ లోని ఒక మైనార్టీ మహిళకు 71 గజాల క్రమబద్ధీకరణకు రూ.11.43 లక్షల్ని వసూలుచేశారు. బంజారాహి్ల్స్ రోడ్నెంబరు2లో మరో వ్యక్తి 53 గజాలకు రూ.5లక్షలు చెల్లించాల్సి రావటం చూస్తే.. సామాన్యులకు ఒకలా.. తమకు అనుకూలంగా.. సన్నిహితంగా ఉండే వారికి మరోలా వ్యవహరిస్తున్న ధోరణి ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

Tags:    

Similar News