షాకిచ్చిన కెనడా.. స్టూడెంట్ వీసాకు ఆర్థిక భారం డబుల్
కెనడా తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా విద్యార్థుల మీద ఆర్థిక భారం డబుల్ కానుంది. ఇప్పటివరకు కెనడా స్టూడెంట్ పర్మిట్ వీసా కోసం డిపాజిట్ ను 10వేల డాలర్లుగా ఉండేది.
ఉన్నత విద్యను విదేశాల్లో చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు భారతీయ విద్యార్థులు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి ఆప్షన్ లో అమెరికా తర్వాత అందరిని ఆకర్షిస్తున్న దేశం కెనడా. అలాంటిది తాజాగా విద్యార్థులకు జారీ చేసే స్టూడెంట్ పాస్ కు సంబంధించి చేదు నిర్ణయాన్ని తీసుకుంది.
కెనడా తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా విద్యార్థుల మీద ఆర్థిక భారం డబుల్ కానుంది. ఇప్పటివరకు కెనడా స్టూడెంట్ పర్మిట్ వీసా కోసం డిపాజిట్ ను 10వేల డాలర్లుగా ఉండేది. మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ.6.2 లక్షలుగా (ప్రస్తుత మారక ధరల ప్రకారం ఒక కెనడా డాలర్ మన రూపాయిల్లో చూస్తే.. రూ.61.35) ఉండేది. ఇప్పుడు దాన్ని 20వేల డార్లకు పెంచుతున్నట్లుగా పేర్కొన్నారు. అంటే..డిపాజిట్ మొత్తం డబుల్ కానుందన్న మాట. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే 20,635 డాలర్లకు పెంచనున్నట్లుగా ప్రకటించారు.
వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. కెనడాలో జీవన వ్యయం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా వివిధ దేశాల నుంచి వస్తున్న విద్యార్థులు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. తాజాగా తాము తీసుకున్న నిర్ణయం పెరుగుతోన్న జీవన వ్యయానికి సంబంధించే కాకుండా తగిన వసతిని పొందటంలోనూ సాయం చేస్తుందని చెబుతున్నారు.
కెనడాలో ఉన్నత చదువుల కోసం అప్లై చేసుకున్న విద్యార్థులు వారికి అవసరమైన కాస్ట్ ఆఫ్ లివింగ్ కోసం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా 10వేల కెనడా డాలర్లుగానే ఉంది. ఈ మొత్తాన్ని విద్యార్థి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇటీవల పెరిగిన ధరలు.. జీవన వ్యయం కారణంగా వారు డిపాజిట్ చేసిన మొత్తం సరిపోవట్లేదు. దీంతో.. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకే.. డిపాజిట్ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
తొలి ఏడాది ట్యూషన్ ఫీజు.. ప్రయాణ ఖర్చులకు ఈ డిపాజిట్ అదనం అన్నది మర్చిపోకూడదు. అంతేకాదు.. విదేశీ విద్యార్థులు క్యాంపస్ బయట పని పరిమితిపై ఇచ్చిన మినహాయింపును వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు 30 వరకు పొడిగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం వారానికి 20 గంటల కంటే ఎక్కవ పని చేసే వీలుంది. అయితే.. ఈ మినహాయింపును ఇప్పటికే కెనడాలో ఉన్న వారితో పాటు డిసెంబరు 7నాటికి అప్లై చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని చెప్పటం గమనార్హం. కెనడాలో ఉన్నత విద్య కోసం ప్లాన్ చేస్తుంటే మాత్రం ఈ అప్డేట్ ను అస్సలు మిస్ కావొద్దు.