వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ ఎక్కడ.. ఏమైపోయారు?

ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి ఈ ఫైర్‌ బ్రాండ్లు కూడా కారణమనేవారు ఉన్నారు.

Update: 2024-07-11 07:10 GMT

వైసీపీలో మాజీ మంత్రులు ఆర్కే రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ లకు ఫైర్‌ బ్రాండ్లుగా పేరుంది. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లపై తీవ్ర విమర్శలు, దుమ్మెత్తిపోయడంలో వీరే తర్వాతే ఎవరైనా అనే పేరు తెచ్చుకున్నారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి ఈ ఫైర్‌ బ్రాండ్లు కూడా కారణమనేవారు ఉన్నారు. వీరి నోటి దురుసు, అహంకారపూరిత మాటలే వైసీపీకి డ్యామేజీ చేశాయనే విమర్శలు ఉన్నాయి.

ముఖ్యంగా కృష్ణా జిల్లా గుడివాడలో 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు.. కొడాలి నాని. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో దాదాపు మూడేళ్లు పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అలాంటి నాని తొలిసారి ఎమ్మెల్యేగా ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇవే తనకు చివరి ఎన్నికలని.. ఇక రాజకీయాల్లో ఉండబోనని ప్రకటించినా ఓటర్లు ఆయనను పట్టించుకోలేదు. 50 వేలకు పైగా ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో నాని చిత్తుగా ఓడారు.

కాగా జగన్‌ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లాలో కొడాలి నాని మంత్రిగా చక్రం తిప్పారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ లపై నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేశారనే విమర్శలు ఉన్నాయి.

ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొడాలి నానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. కొడాలి నానితోపాటు ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, నాటి జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) మాధవీలతపై పోలీసులు కేసు పెట్టారు. ఈ మేరకు దుగ్గిరాల ప్రభాకర్‌ అనే వ్యక్తి వీరి ముగ్గురుపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై గుడివాడలో కేసు దాఖలైంది.

తన గోడౌన్‌ లో ఉన్న లిక్కర్‌ కేసులను పగులకొట్టి.. తగులబెట్టారని.. అంతేకాకుండా తన తల్లిని అసభ్యంగా కొడాలి నాని, వాసుదేవరెడ్డి దూషించడంతో ఆ మానసిక వేదనతో ఆమె మరణించారని దుగ్గిరాల ప్రభాకర్‌ గుడివాడ టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు కొడాలి నాని సహా మిగిలిన వారిపై 448,427,506 ఆర్‌ అండ్‌ డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ కేసుకు ముందు మాజీ వలంటీర్లు కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. తమను బెదిరించి బలవంతంగా రాజీనామాలు చేయించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కొడాలి నానిపై గుడివాడ వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో కొడాలి నాని ఎక్కడా కనిపించడం లేదు. ఆయన ఇంటిపైకి ఇటీవల టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఆయన ఇంటి ముందు ధర్నా కూడా చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ లపై గతంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

అయితే కొడాలి నాని ఇంటి నుంచి బయటకు రాలేదు. పోలీసుల రక్షణలోనే ఉన్నారు.

కాగా ఇప్పటికే నమోదైన కేసులు చాలవన్నట్టు గత ప్రభుత్వ హయాంలో రేషన్‌ బియ్యం పెద్ద ఎత్తున పక్కదాని పట్టాయని.. వాటిని పాలిష్‌ చేసి కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతి చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన రేషన్‌ కుంభకోణంపై విచారణ జరపాలని నిర్ణయించింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.. ఈ స్కామ్‌ సంగతి తేల్చాలని పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ ముఖ్య నేత అయిన నాదెండ్ల మనోహర్‌ ను ఆదేశించారు.

దీంతో జగన్‌ ప్రభుత్వంలో దాదాపు మూడేళ్లపాటు పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన తన అనుచరులకు, వైసీపీ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేరని.. అదృశ్యమయ్యారని అంటున్నారు. ఆయన రాష్ట్రంలోనే లేరని.. తెలంగాణలో ఉన్నారని కొందరు చెబుతుండగా.. మరికొంతమంది ఆయన విదేశాలకు వెళ్లారని చెబుతున్నారు.

బాబు, పవన్, లోకేశ్‌ వంటి నేతలపై కొన్నేళ్లపాటు పరుష వ్యాఖ్యలతో దాడి చేసిన కొడాలి నానిని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేలా కనిపించడం లేదు. మరి ఈ పరిస్థితిని కొడాలి నాని ఎలా అధిగమిస్తారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News