రంగంలోకి కేంద్ర బలగాలు

అయితే ఇపుడు జరుగుతున్నది ఏమిటంటే మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలను కేంద్ర బలగాలు తమ అదుపులోకి తీసేసుకున్నాయి.

Update: 2023-11-27 09:30 GMT

ఈనెల 30వ తేదీన జరగబోయే పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగానే కేంద్ర బలగాలు పోలింగ్ కేంద్రాల దగ్గరకు చేరుకున్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసు బందోబస్తుగా నిలవటం ప్రతి ఎన్నికలోను జరిగే సహజం పరిణామమే. అయితే ఇపుడు జరుగుతున్నది ఏమిటంటే మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలను కేంద్ర బలగాలు తమ అదుపులోకి తీసేసుకున్నాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ తో పాటు మహబూబ్ నగర్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో కూడా మావోయిస్టుల ప్రభావం ఉంటుంది.

అందుకనే రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికల ప్రకారం కేంద్ర ఎన్నికల కమీషన్ భద్రతా విషయంలో కట్టుదిట్టమైన చర్చలు తీసుకున్నది. పై జిల్లాల్లో మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలు 614 ఉన్నట్లు గుర్తించింది. ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో ఇప్పటికే రెగ్యులర్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా క్యాంపు వేసేశాయి. పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల ప్రాంతాల్లోను, గ్రామాలకు చుట్టూ ఉన్న అడవులను కేంద్ర బలగాలు జల్లెడపడుతున్నాయి.

ఎన్నికలను బహిష్కరించాలని, బీఆర్ఎస్, బీజేపీలను తరిమికొట్టాలని మావోయిస్టులు ఇప్పటికే పదేపదే పిలుపిస్తున్నవిషయం తెలిసిందే. మొన్ననే జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లో కొన్నిచోట్ల మావోయిసట్లు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. దాంతో తెలంగాణాలో పోలీసులు, కేంద్ర బలగాలు అలర్ట్ అయిపోయాయి. మావోయిస్టుల ప్రభావం పోలింగ్ పై ఏ విధంగా కూడా ఉండకూడదన్నది ప్రభుత్వం ఆలోచన. కేంద్ర బలగాలు ఎక్కువగా భూపాలపల్లి, ములుగు, అసిఫాబాద్, భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, చెన్నూరు, సిర్పూర్ నియోజకవర్గాలపైన ప్రత్యేక దృష్టిపెట్టాయి.

రాష్ట్రానికి ఇప్పటికే కేంద్రం నుండి వివిధ యూనిట్లలో పనిచేస్తున్న 24 వేలమంది పోలీసులు వచ్చారు. వీళ్ళల్లో అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటి పోలీస్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటి గార్డ్స్, సశస్త్ర సీమాబల్ బలగాలున్నాయి. వళ్ళల్లో సగంమందిని పైన చెప్పిన నియోజకవర్గాల్లోని పోలీంగ్ కేంద్రాల్లో మోహరించింది ఎన్నికల కమీషన్. పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూముల భద్రతను కూడా వీళ్ళే చూసుకుంటున్నారు.

Tags:    

Similar News