జగన్ ని ఆడిపోసుకున్న బాబు అదే పని చేస్తున్నారు
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జగన్ బాటనే నడుస్తున్నారు అని అంటున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జగన్ బాటనే నడుస్తున్నారు అని అంటున్నారు. విపక్ష నేతగా జగన్ మీద విపరీతంగా విమర్శలు చేస్తూ నాడు ఆడిపోసుకున్నారు. ఇదేం బాదుడు జగన్ అని ఊరూ వాడా తిరిగారు, తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ ఇపుడు మాత్రం బాబు అదే పనిలో ఉన్నారు.
ఇంతకీ ఆ కధ ఏంటి అంటే జగన్ విద్యుత్ చార్జీలను దారుణంగా పెంచేశారు. ఆయన సంక్షేమ పధకాల కోసం నిధులను ఎలా తెచ్చుకోవాలో ఆలోచించి మరీ ట్రూ అప్ చార్జిల పేరుతో మోత మోగించారు. ఎంతలా అంటే సామాన్యుడి నడ్డి విరిగేలా.
ఇవన్నీ విద్యుత్ సంస్థలు తమ నష్టాల నుంచి గట్టెక్కడానికి ఖజానా మీద భారం పడకుండా ఉండడానికి వీలైతే ఆదాయం అందుకోవడానికి చేసిన పనులు. అలా ట్రూ అప్ చార్జిలతో జగన్ పేదలు సామాన్యులకు బాగా దూరం అయ్యారు.
ఎందుకంటే విద్యుత్ చార్జిల మోత వల్ల చిన్న వ్యాపారులు, సామాన్య జీవులు బీదా బిక్కీ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అందుకే వారంతా పని గట్టుకుని మరీ జగన్ ఓటమికి కారణం అయ్యారు అని కూడా అంటారు. మరి ఆనాడు కూటమి పెద్దలు చెప్పిందేంటి అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి.
మేము అధికారంలోకి వస్తే జగన్ వడ్డించిన విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని మళ్లీ అయిదేళ్ల పాటు వాటిని అలాగే ఉంచుతామని. తీరా కూటమి గద్దెనెక్కింది కానీ నాలుగు నెలలలో విద్యుత్ చార్జిల భారం అలాగే ఉంది. ఎపుడైనా తగ్గించకపోతారా అని ఎదురుచూస్తున్న జనానికి ఆ తగ్గింపు లేకపోగా కొత్త వడ్డింపు మొదలైంది.
అది ఎలా ఉంది అంటే ఏకంగా ట్రూ అప్ చార్జీల పేరుతో 8,113 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపేందుకు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కార్ రెడీ అయిపోయింది. వీటి పేరు అందంగా సర్దుబాటు చార్జీలు అని పెట్టారు. ఆ సర్దుబాటు ఏదో ప్రభుత్వం చేసి ప్రజలకు ఉపశమనం ఇవ్వవచ్చు కదా అంటే అబ్బే ఖజానాలో అంతా ఖాళీగా ఉంది కాబట్టి ప్రజలే భరించాలి అన్నట్లుగా ప్రభుత్వం దూకుడు చేస్తోంది.
ఈ విధంగా సర్దుబాటు చార్జీల పేరుతో భారీ వడ్డనకు దిగుతున్న కూటమి సర్కార్ పట్ల వామపక్షాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఎన్నికల ముందు చెప్పింది ఏంటి ఇపుడు చేస్తున్నది ఏమిటి అని కూడా నిలదీస్తున్నాయి. ఒక్క రూపాయి పెంచినా ఊరుకునేది లేదు, మేమే ఆందోళనలు చేస్తామని కూడా సీపీఎం నాయకులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు
అధికారంలోకి వచ్చిన తొలి నాలుగు నెలల వ్యవధిలోనే ఈ విధంగా చార్జీలు పెంచితే ఎలా అని కూడా అంటున్నారు. ఎన్నికల్లో చెప్పిన మేరకు వ్యవహరించాలని కూడా అంటున్నారు. అయితే ట్రూ అప్ చార్జీల మోత తప్పేట్లు లేదని అంటున్నారు. వేల కోట్ల రూపాయలను సర్దుబాటు చేసేందుకు ఖజానా అనుమతించడంలేదు
మరో వైపు చూస్తే విద్యుత్ సంస్థలకు ఆర్ధికంగా పెను భారం అవుతుంది. దాంతో జనాల మీదనే పడిపోవాలన్నది సూత్రప్రాయంగా నిర్ణయించేశారు. దాంతో ఈ భారీ వడ్డన నడ్డి విరిచే కార్యక్రమం తొందరలోనే ఉండబోతోంది. అదే కనుక జరిగితే కోరి కూటమి విపక్షాలకు చాన్స్ ఇచ్చినట్లే అంటున్నారు.