'సూప‌ర్ సిక్స్‌'కు రిలీఫ్ ఇచ్చారు.. ఈ విష‌యం మ‌రిచారు.. !

ఈ క్ర‌మంలోనే ఆయ‌న సూప‌ర్ సిక్స్‌కు సంబంధించి ప్ర‌ధాన మీడియాకు స‌మాచారం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

Update: 2024-10-18 10:13 GMT

ఎట్ట‌కేల‌కు సీఎం చంద్ర‌బాబు జ‌నం నాడి తెలుసుకున్న‌ట్టుగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సూప‌ర్ సిక్స్‌కు సంబంధించి ప్ర‌ధాన మీడియాకు స‌మాచారం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను జ‌న‌వ‌రి నుంచి అమ‌లు చేసేందుకు రంగం రెడీ చేస్తున్న‌ట్టు తెలిసింది. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించి న సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలపై ప్ర‌జ‌ల్లో భావోద్వేగం ఎక్కువ‌గా ఉంది. అప్పటి వ‌ర‌కు రూ.15000 అమ్మ ఒడికి అల‌వాటు ప‌డిన మ‌హిళ‌లు.. చంద్ర‌బాబు ఇచ్చిన హామీకి మ‌రింత ఫిదా అయ్యారు.

ఇంట్లో ఎంత మంది ఉంటే అంత‌మందికీ.. రూ.15 వేల చొప్పున ఇస్తామ‌న్నారు. ఇది స‌హ‌జంగానే పేద‌ల కుటుంబాల్లో ఆశ‌లు రేకెత్తిస్తుంది. ఇవ్వ‌నివాడిని ఎవ‌రూ అడ‌గ‌రు. ఇస్తామ‌న్న వారిపైనే ఆశ‌లు పెట్టుకుం టార‌ని అన్న‌ట్టుగా చంద్ర‌బాబుపైనే ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. నాలుగు మాసాలు అయినా.. స‌ర్కారు సూప‌ర్ సిక్స్‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కేవలం పింఛ‌న్లు పెంచి వ‌దిలేసింది. ఇది ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌గా మారింది. దీనిపై త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తుండ‌డం.. సైట్ల‌లో కామెంట్లు ప‌డుతుండ‌డంతో స‌ర్కారు క‌దిలింది.

ఈ నేప‌థ్యంలోనే జ‌న‌వ‌రి నుంచి మ‌హిళ‌ల‌కు.. రూ.15000 చొప్పున మాతృవంద‌నం ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు ఉన్నా..ఇ స్తామ‌ని కూడా తాజాగా మ‌రోసారి సీఎం ప్ర‌క‌టించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఈ ప్ర‌క‌ట‌న వెనుక వాస్త‌వం ఎంత‌? అనేది కీల‌కం. ఎందుకంటే.. ప్ర‌స్తుతం వైసీపీ రూపొందించిన జాబితా ప్ర‌కారం.. ఒక్కొక్క‌రికే అప్ప‌ట్లో అమ్మ ఒడిఇచ్చారు. సో.. ఇలా ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధి పొందిన వారికి ఒక పిల్ల లేదా పిల్లాడు ఉన్నాడ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

కానీ, ఎంత మంది పిల్ల‌లు ఉన్నా.. ఇస్తామ‌న్న చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న ద‌రిమిలా.. స‌ర్వే చేయాల్సి ఉంది. పేద‌ల ఇళ్ల‌లో ముగ్గురు, న‌లుగురు పిల్ల‌లు కూడా ఉన్నారు. మెజారిటీగా ఇద్ద‌రు కామ‌న్‌గా ఉన్నారు. ఎక్క‌డొ రేర్‌గానే ఒక పిల్ల లేదా పిల్లాడు ఉన్న కుటుంబాలు ఉన్నాయి. సో.. ఈ స‌ర్వే పూర్తి చేయాల్సి ఉంది. కానీ, జ‌న‌వ‌రి నుంచి అమ‌లు చేస్తామ‌ని చెబుతున్న ద‌రిమిలా ఈ స‌ర్వేను వ‌చ్చే నెల‌లోనే పూర్తి చేస్తారా? అనేది ప్ర‌శ్న‌. ఆద‌రా బాద‌రాబాగా లిస్టు చేస్తే.. అర్హులు త‌ప్పిపోవ‌చ్చు.

ఇదే జ‌రిగితే.... విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద సాయం చేసిన‌ట్టుగానే ఉంటుంది. ఎందుకంటే.. ఇప్ప‌టికీ బాధితులు క‌లెక్ట‌ర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. కాబ‌ట్టి అలా కాకుండా... స‌మ‌యం తీసుకున్నా.. ల‌బ్ధిదారుల జాబితాలో తేడా రాకుండా.. విమ‌ర్శ‌లు లేకుండా.. అర్హులైన అంద‌రికీ అందించేలా దీనిని అమలు చేస్తేనే ప‌థ‌కానికి సార్థ‌క‌త‌.

Tags:    

Similar News