రెడ్ బుక్ కాదు జగన్ బుక్ : కూటమి పెద్దలు అలెర్ట్ !
ఏపీలో వైసీపీ అధికారం నుంచి దిగిపోయి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఏపీలో వైసీపీ అధికారం నుంచి దిగిపోయి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే గతానికి భిన్నంగా కూటమి పెద్దల వైఖరి ఉంటోంది. ప్రతీ విషయాన్ని ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పదవుల విషయం నుంచి పాలన విషయం దాకా ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు.
గత అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏ తప్పులు చేసింది అన్నది తరచి చూసుకుని మరీ ఆ విధంగా తాము చేయకూడదని ఒట్టేసుకుని జాగ్రత్తగా సాగుతున్నారు. ఏపీలో అయిదేళ్ల పాటు సీఎం గా ఉన్న జగన్ పార్టీని క్యాడర్ ని గాలికి వదిలేశారు అన్న విమర్శలు ఉన్నాయి. దాంతో కీలకమైన ఎన్నికల వేళ క్యాడర్ కూడా పట్టు జార్చేసింది.
ఫలితంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి చావు దెబ్బ తగిలింది. పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అయింది. ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఎమ్మెల్యేలు కానీ పార్టీని పట్టించుకోకపోవడం వల్ల వారికి లభించిన రిటర్న్ గిఫ్ట్ ఇదని కూటమి పెద్దలు బాగానే గ్రహించారు. అందుకే వారు అలెర్ట్ అయిపోయారు.
కూటమి సర్కార్ ఏర్పడిన డే వన్ నుంచి అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ పార్టీకి పెద్ద పీట వేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఎంత బిజీగా ఉన్న చంద్రబాబు ప్రతీ శుక్రవారం కార్యకర్తలకు నేతలకు టైం కేటాయిస్తున్నారు. ఇది ఠంచనుగా సాగుతోంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నేతలను పలకరిస్తూ వారి విన్నపాలను స్వీకరిస్తున్నారు.
ఇక పార్టీ క్యాడర్ కి సీఎం ని కలిశామన్న సంతృప్తి ఉంటోంది. కేవలం అధినేత స్థాయిలోనే కాకుండా మంత్రులు ఎమ్మెల్యేలను కూడా పార్టీ కార్యకర్తలను కలవమని చెబుతూ దానిని ఆదేశంగా మార్చారు. అలాగే జిల్లా పార్టీ ఆఫీసుల్లో మంత్రులు నెలలో ఒక రోజు అయినా గడుపుతూ క్యాడర్ నుంచి వినతులు స్వీకరించాలని ఆదేశాలు వెళ్ళాయి.
ఇంకో వైపు చూస్తే జనసేన కూడా ఇదే విధానం అనుసరిస్తోంది. పవన్ జనవాణి కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కొనసాగిస్తున్నారు. పార్టీ సమావేశాలు పెడుతూ క్యాడర్ తో కనెక్షన్ ఉండేలా చూసుకుంటున్నారు. అంతే కాదు మంత్రులు ఎమ్మెల్యేలను మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో నెలలో కొన్ని రోజులు ఉండేలా డైరెక్షన్లు ఇచ్చారు. ఆ మేరకు షెడ్యూల్ ని కూడా రూపొందించారు.
ఇవన్నీ చూస్తూంటే చంద్రబాబు కానీ పవన్ కానీ క్యాడర్ కి ఎంతో విలువ ఇస్తున్నారు అని అంటున్నారు. పార్టీ ఉంటేనే ప్రభుత్వాలూ అధికారాలూ అన్నది వైసీపీని చూసిన తరువాత అయినా తెలుసుకోవాల్సి ఉందని అంటున్నారు. పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బ తింటే కచ్చితంగా అది పార్టీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని గ్రహించే కూటమి పెద్దలు ఈ విధంగా అప్రమత్తం అవుతున్నారు.
వైసీపీ మాత్రం రెడ్ బుక్ ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అని టీడీపీ కూటమి మీద ఆరోపణలు చేస్తోంది. కానీ కూటమి పెద్దలు రెడ్ బుక్ ని పక్కన పెట్టి జగన్ బుక్ ని చదివి తమ ప్రభుత్వం ఏ తప్పులూ చేయకుండా అలెర్ట్ అవుతున్నారు అని ప్రచారం సాగుతోంది. ఇది ఒక విధంగా అధికార పార్టీ క్యాడర్ కి ఉత్సాహం ఇస్తోంది. ఇపుడు వైసీపీ కూడా క్యాడర్ కి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.