చంద్రబాబుకు దడ పుట్టిస్తున్న ‘దర్బార్‌’

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, ఇతర టీడీపీ నేతలు ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-05 05:47 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, ఇతర టీడీపీ నేతలు ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి తరలి వస్తున్నారు. అక్కడ ప్రజల నుంచి టీడీపీ నేతలు అర్జీలు స్వీకరిస్తున్నారు. ఇందుకోసం చంద్రబాబు టీడీపీ నేతలకు వంతులవారీగా బాధ్యతలు అప్పగించారు.

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి శనివారం టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. ఆయన కుమారుడు నారా లోకేశ్‌ ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతిపత్రాలు ఇస్తున్నారు.

ఎక్కువ శాతం మంది భూముల సమస్యలపై వినతిపత్రాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తమ భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారని.. భూరికార్డులు మార్చేశారని.. ఆన్‌లైన్‌ లో వారి పేర్లతో ఎక్కించుకున్నారని.. తమకు న్యాయం చేయాలని చంద్రబాబుకు విన్నవిస్తున్నారు.

ఈ ప్రజాదర్బార్‌ లో వస్తున్న వినతులు, సమస్యలు చూసి సీఎం చంద్రబాబు షాక్‌ కు గురయ్యారని చెబుతున్నారు. ఎక్కువ శాతం అన్నీ భూసమస్యలే ఉండటం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మండలానికో భూ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. వీటిపైన సమగ్ర విచారణ చేస్తామని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలన్నింటిని పరిష్కరించామని చెప్పిందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రజల సమస్యలన్నీ పరిష్కారమయితే ఈ స్థాయిలో తమ వద్దకు ప్రజలు సమస్యల పరిష్కారానికి ఎందుకొస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

తమకు వినతిపత్రాలు సమర్పిస్తున్నవారిలో భూ బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది, వైసీపీ హయాంలో జరిగిన భూకుంభకోణాలపై ఇద్దరు ఐపీఎస్, ఐఏఎస్‌ లతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఈ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల కమిటీ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూకుంభకోణాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, కబ్జాల వ్యవహారంపై దృష్టి సారిస్తుందని చెబుతున్నారు. సాక్షాత్తూ వైఎస్‌ జగన్‌ నియోజకవర్గం పులివెందులలో కూడా జగన్‌ బంధువులు తమ భూములను ఆక్రమించారని ఒక మహిళ చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు.

ఇలా ఎంతో మంది నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచి మంగళగిరికి తరలివచ్చి తమకు న్యాయం చేయాలని విన్నవిస్తున్నారు. పులివెందులలోనే కాకుండా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూకుంభకోణాలు భారీ ఎత్తున జరిగాయని ప్రభుత్వ పరిశీలనలో తేలిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి ఈ భూకుంభకోణాల లెక్క తేల్చాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News