చంద్రబాబు అయిదేళ్ళ సీఎం కాదా...మధ్యలో ఎవరు ?

ఆయన మాదిరిగా ఒక ప్రాంతీయ పార్టీ అధినేత మూడు దశాబ్దాలుగా పార్టీకి సారధ్యం వహించలేదు.

Update: 2024-06-22 17:00 GMT

ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణం చేసి గట్టిగా చూస్తే పది రోజులు అయింది. బాబుకు ఇప్పటిదాకా తెలుగు రాష్ట్ర రాజకీయాలలో అరుదైన రికార్డులు ఉన్నాయి. ఆయన మాదిరిగా ఒక ప్రాంతీయ పార్టీ అధినేత మూడు దశాబ్దాలుగా పార్టీకి సారధ్యం వహించలేదు.

ఆయన లాగ ముమ్మారు సీఎం గా వ్యవహరించలేదు అలాగే ఎవరూ కూడా మరో ముమ్మారు ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించలేదు. ఆ క్రెడిట్స్ అన్నీ ఆయన ఖాతాలోనే పదిలంగా ఉంటాయి. ఇక నాలుగవ సారి సీఎం గా బాబు బాధ్యతలు చేపట్టారు అంటే ఇది సరికొత్త చరిత్ర. దీని బద్దలు కొట్టడం ఇప్పట్లో ఎవరి వల్లా కానే కాదు అని అంటున్నారు.

ఈ టెర్మ్ ను సక్సెస్ ఫుల్ గా ఆయన పూర్తి చేస్తే ఏకంగా 19 ఏళ్ళు సీఎం గా ఉన్న ఘనతను సాధిస్తారు. ఇదిలా ఉంటే చంద్రబాబు మీదనే నమ్మకం ఉంచి టీడీపీ కూటమికి ప్రజలు ఈసారి భారీ మెజారిటీతో గెలిపించారు. చంద్రబాబుకు ఉన్న విజన్ ఆయన విశేష అనుభవం ఏపీని ఒక గాడిన పెడతాయని అంతా నమ్ముతున్నారు. విభజన తరువాత ఏపీ మరింతగా కునారిల్లింది.

పదేళ్లలో దారుణంగా మారింది. దాంతో ఈసారి నుంచి అయినా ఎపీని బాగు చేసుకోవాలన్న ఆలోచనతోనే అంతా కలసి బాబుకు ఓటేశారు. ఇలా బాబుకు పాజిటివ్ ఓటు గానే చూడాలి. ఏపీలో సమస్యలు చూస్తే కొండవీటి చాంతాడు మాదిరిగా ఉన్నాయి. ఈ అయిదేళ్ళ సమయం సరిపోతుందా అన్న చర్చ కూడా ఉంది.

అయితే టీడీపీలో మాజీ మంత్రి రాజకీయంగా తలపండిన వారు అయిన జేసీ దివాకర్ రెడ్డి తాజాగా ఒక యూ ట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాబు వంటి విజనరీ ఇపుడు ఏపీకి అవసరం ఉంది అన్నారు ఆయన హయాంలో ఏపీ బాగుపడి తీరుతుందని కూడా అన్నారు.

దాంతో పాటు ఆయన మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. అవేంటి అంటే చంద్రబాబు ఈ టెర్మ్ ఫుల్ గా అధికారంలో ఉండకపోవచ్చు అని. మధ్యలోనే ఆయన పక్కకు తప్పుకుని తన కుమారుడు నారా లోకేష్ ని ముఖ్యమంత్రిగా చేస్తారు అని జోస్యం లాంటిదే చెప్పారు.

జేసీ చెప్పినది వింటే ఆశ్చరంగానే ఉంది. ఏపీని అనుభవశాలి అయిన బాబు చేతిలో జనాలు పెట్టింది దశ దిశ మార్చడానికి. ఈ నేపధ్యంలో బాబు కంటే ఎందరు రేసులో ఉన్నా ఎవరు సీఎం గా వచ్చినా ఏపీ ప్రజలు అనుకున్న విధంగా అభివృద్ధి సాధ్యపడుతుందా అన్న డౌట్లు ఉన్నాయి.

అయితే బాబు కేవలం సీఎం మాత్రమే కాదు, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు. దానితో పాటు ఆయనకు రాజకీయ వారసుడు ఉన్నారు. టీడీపీని కూడా ఆయన కాపాడుకోవాలి. ఇపుడు వచ్చినది సువర్ణ అవకాశం. టీడీపీ చరిత్రలో ఇంత పెద్ద తీర్పు రాలేదు. స్ట్రైక్ రేటు చూసినా అదుర్స్ అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. మొత్తం 144 సీట్లకు పోటీ చేస్త 135 సీట్లు గెలవడం అంటే గ్రేట్ అని చెప్పాలి.

ఇంతలా సీట్లు దక్కాక తన మాట పూర్తి స్థాయిలో చెల్లుబాటు అవుతున్న వేళ లోకేష్ బాబుని ఇపుడు కాక మరెప్పుడు బాబు సీఎం గా చేస్తుకుంటారు చూస్తారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 2029 ఎన్నికల్లో గెలిచిన తరువాత పార్టీ పగ్గాలతో పాటు సీఎం గా ఛాన్స్ ఇవ్వవచ్చు అని అనుకున్నా అప్పటికి రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది కూడా ఉంటుంది కదా.

పైగా అప్పుడు మరోసారి గెలిచినా ఇంతటి భారీ మెజారిటీ రాకపోవచ్చు. బొటాబొటీ మెజారిటీతో నారా లోకేష్ ని సీఎం చేసి రిస్క్ తో కిరీటం నెత్తిన పెట్టాలనుకోకపోవచ్చు. ఇక ఏపీలో టీడీపీకి ఆల్టర్నేషన్ గా పవన్ జగన్ ఉండనే ఉంటారు. దాంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న రాజకీయ నీతిని బాబు అమలు చేస్తారని అంటున్నారు.

సరిగ్గా ఇదే ఊహించి జేసీ ఈ విధంగా వ్యాఖ్యానించి ఉండొచ్చు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఇపుడిపుడే బాబు లోకేష్ ని సీఎం చేయరు. ఏపీని ఒక దారిలో పెట్టి అంతా బాగుందనిపించాకనే ఆయనకు పాలనా పగ్గాలు అందించవచ్చు. బహుశా అది 2027 జూన్ నాటికి జరగవచ్చు అని అంటున్నారు. అప్పటికి మూడేళ్ళ పాలన పూర్తి అవుతుంది. ఎన్నికలు ఎదుర్కోవడానికి సరైన సమయం కూడా ఉంటుంది. దాంతో జేసీ కామెంట్స్ అలా నిజం అవుతాయని అంటున్నారు.

Tags:    

Similar News