మోడీ పెట్టిన 'శివశక్తి' పేరు అధికారం అవుతుందా?
అంతరిక్షంలోని ఏ ప్రాంతానికైనా పేరు పెట్టేందుకు ఒక సంస్థ ఆమోదం అవసరం. దాని పేరు ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్
చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావటం.. యావత్ భారతావని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కావటం.. ఈ ప్రయోగం విజయవంతం అయిన వేళ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉండటం తెలిసిందే. టూర్ ముగిసి భారత్ కు తిరిగి వచ్చిన ప్రధాని ఢిల్లీకి వెళ్లకుండా.. నేరుగా బెంగళూరుకు వచ్చి ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందించటం తెలిసిందే. ఈ సందర్భంగా ల్యాండర్ దిగిన చోటుకు శివశక్తి అన్న పేరు పెడుతున్నట్లుగా పేర్కొన్నారు. గతంలో చంద్రయాన్ 2 కూలిన ప్రదేశానికి తిరంగా పాయింట్ అన్న పేరును పెడుతున్నట్లుగా మోడీ చెప్పటం తెలిసిందే. ఇక.. చంద్రయాన్ 1లో భాగంగా చంద్రుడి మీద క్రాష్ ల్యాండ్ అయిన చోటుకు జవహర్ స్థల్ అన్న పేరును అప్పటి యూపీఏ సర్కారు పెట్టటం తెలిసిందే.
యూపీఏ ప్రభుత్వం పెట్టిన జవహర్ స్థల్ పేరుకు అప్పటి విపక్షాలు విరుచుకుపడితే.. చంద్రయాన్ 3లో ల్యాండర్ దిగిన చోటుకు శివశక్తి పేరును పెట్టటంపై ఇప్పటి విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దేవుడి పేర్లను ఎలా పెడతారని? అందరికి ఆమోదయోగ్యమైన పేర్లు పెట్టాలన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. చంద్రుడి మీద కానీ.. అంతరిక్షంలోని ఏ ప్రాంతానికైనా.. ఏ గ్రహంలోని భాగానికైనా పేరు పెట్టాలంటే ప్రాసెస్ ఏంటి? దానికి ఎవరి ఆమోదం అవసరం? దానికి నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ప్రధాని మోడీ పెట్టిన పేర్లు అధికారికం కానున్నాయా? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అంతరిక్షంలోని ఏ ప్రాంతానికైనా పేరు పెట్టేందుకు ఒక సంస్థ ఆమోదం అవసరం. దాని పేరు ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్. సంక్షిప్తంగా చెప్పాలంటే ''ఐఏయూ''. ఈ సంస్థను 1919లో ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం చంద్రుడు కావొచ్చు. అంతరిక్షంలోని ఏ గ్రహం కాని.. ఉపగ్రహం కాని ఏ దేశానికి సొంతం కాదు. అన్ని దేశాలకు ఆయా గ్రహాలు.. ఉప గ్రహాల మీద పరిశోధనలు చేసే హక్కు ఉంటుంది.
ఇక.. ఆయా ప్రాంతాలకు పేర్లు పెట్టే విషయంలో ఏ దేశానికి ఆ దేశం పెట్టేసుకుంటే కష్టం కావట్టి.. ఒక ప్రాసెస్ ద్వారా పేర్లు పెట్టే ప్రక్రియను ఏర్పాటు చేవారు. ఈ సంస్థలో భారత్ తో సహా మొత్తం 92 దేశాలకు సభ్యత్వం ఉంది. విశ్వాంతరాల్ని భూతద్దం వేసి మరీ గాలించిన మహనీయుడు గెలీలియో. ఆ మహానుభావుడు 1610 (దాదాపు 400 ఏళ్ల క్రితమే)లోనే చంద్రుడి మీద పర్వతాల్ని.. బిలాల్ని గుర్తించాడు.
గెలీలియో తర్వాత 1647లో మైకేల్ వాన్ లాంగ్రెస్ అనే శాస్త్రవేత్త చందమాద మ్యాప్ ను తయారు చేశారు. చందమామ మీద ఉన్న బిలాలకు ఆయన అప్పట్లో పెట్టిన పేర్లలో మూడింటిని మాత్రమే ఇప్పటికి పిలుస్తున్నారు. చంద్రుడి మీద సముద్రాలు లేకున్నా.. పలు ప్రాంతాలకు పెట్టిన ''సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, సీ ఆప్ క్లౌడ్స్ '' లాంటి పేర్లు పిలవటానికి కారణం ఈ పెద్ద మనిషే కారణం. 1651లో గ్రిమాల్డి.. రిక్కియోలి అనే ఇద్దరు అస్త్రానమర్లు పెట్టిన పేర్లను ఇప్పటికి కొనసాగిస్తున్నారు. చంద్రుడి మీదున్న 210 బిలాలకు రిక్కియోలి పెట్టిన పేర్లనే ఇప్పటికి వాడుతున్నారు. ఇక.. పేర్లు పెట్టే విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. పెట్టే పేర్లు సులువుగా.. గందరగోళానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే పెట్టిన పేర్లను మళ్లీ పెట్టకూడదు. వీలైనంతవరకు ఖగోళ శాస్త్రానికి సేవలు అందించిన శాస్త్రవేత్తల పేర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. రాజకీయ.. సైనిక.. మత ప్రాముఖ్యత ఉన్న పేర్లను వీలైనంతగా ఉపయోగించకూడదు.
దేనికైనా పేరు పెట్టటానికి ప్రతిపాదనల్ని తొలుత టాస్క్ గ్రూపులు పరిశీలిస్తాయి. తమకు వచ్చిన పేర్లను పరిశీలించిన టాస్క్ గ్రూప్ ఛైర్ పర్సన్.. తమ నిర్ణయాన్ని వర్కింగ్ గ్రూప్ ఫర్ ప్లానెటరీ సిస్టమ్ నోమెన్ క్లేచర్ కు సిఫార్సు చేస్తారు. ఆ టీంలోని సభ్యులు ఆ పేర్లను పరిశీలిచి.. ఏ పేర్లకు ఎక్కువ ఒట్లు వస్తాయో వాటిని అధికారికంగా ప్రకటిస్తారు. అనంతరం గెజటీర్ ఆఫ్ ప్లానెటరీ నోమెన్ క్లేచర్ లో చేరుస్తారు. అనంతరం వెబ్ సైట్ లో పబ్లిష్ చేస్తారు. ఆ పేర్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. మూడు నెలల్లో వాటిని ఐఏయూ జనరల్ సెక్రటరీకి తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు.
భారత అంతరిక్ష రంగానికి పితామహుడిగా పేర్కొనే విక్రమ్ సారాభాయ్ గురుతుగా.. చంద్రుడి మీదున్న ఒక బిలానికి ఆయన పేరును పెట్టారు. ఇది.. చంద్రుడి ఈశాన్య ాగంలోని మేర్ సెరెనిటాటిస్ ప్రాంతంలో ఉండే గుండ్రటి బిలానికి బెస్సెల్ ఏ అనే పేరుంటే.. ఆ స్థానంలో సారాభాయ్ పేరును 1973లో సారాభాయ్ బిలంగా గుర్తింపును ఇచ్చారు.దీనికి 250-300 కిలోమీటర్ల దూరంలోనే 1972లో అపోలో 17 వ్యోమనౌక.. 1973లో లూనా 21 మిషన్లు లాంఛ్ అయ్యాయి. దేవుడి పేర్లు కాకుండా మతపరమైన పేర్లకు అంతరిక్షంలోని కొన్ని చోట్ల పెట్టారు.
ఉదాహరణకు గురు గ్రహానికి.. శనిగ్రహానికి ఉప గ్రహాలకు గ్రీకు- రోమన్ పురాణాల్లోని దేవుళ్ల పేరును పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పెట్టిన శివశక్తి పేరును అధికారికం చేయటం అసాధ్యమైన విషయం కాదు. కానీ.. అందుకు అవసరమైన ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాకుంటే.. మోడీ వ్యతిరేకులు.. శివశక్తి అన్న దేవుడి పేరును పెట్టటమా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసే వారిపై ఒక వర్గం ఆగ్రహాన్ని వ్యక్తం చేయనుంది. మోడీ పెట్టిన శివశక్తి అన్న పేరు అధికారికం కానుందా? లేదా? అన్నది తేలాలంటే మాత్రం మరికొంత సమయం పడుతుంది.