పవన్ దిగిరాక తప్పదా? మారుతున్న జనసేన పరిణామాలు!
అయితే.. ఎప్పుడైతే టీడీపీతో చేతులు కలిపారో.. అప్పుడే వారిలో అనుమానాలు వెల్లువెత్తాయి.
రాష్ట్రంలో టీడీపీ-జనసేన పార్టీలు ఐక్యంగా ముందుకు సాగాలని, వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికార పీఠం ఎక్కాలనే లక్ష్యాన్ని ఏర్పరుచుకున్న దరిమిలా.. అనేక సందేహాలు.. సమస్యలు పొడచూపాయి. అప్పటి వరకు కాపులు సీఎంగా పవన్‌ను చూడాలని భావించిన మాట వాస్తవం. అయితే.. ఎప్పుడైతే టీడీపీతో చేతులు కలిపారో.. అప్పుడే వారిలో అనుమానాలు వెల్లువెత్తాయి. దీంతో నేతల మధ్య లుకలుకలు ప్రారంభమయ్యాయి. దీంతో పవన్ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో వెంటనే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి.. జిల్లాల్లో మీటింగులు పెట్టారు. అయితే.. ఇది కూడా పెద్దగా ఫలించలేదు. దీంతో పొత్తు అనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఎక్కడ ఎప్పుడు.. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేది కూడా ప్రధాన సందేహంగా మారింది. ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు.. విమర్శల మధ్యే పొత్తుకు ప్రాతిపదిక పడిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నారు.
అయితే.. ఆదిలో హంస పాదు అన్నట్టుగా.. వచ్చే ఎన్నికల్లో తాము గెలిచి తీరుతామన్న నాయకులు.. ఈ పొత్తును విభేదించడం.. ముఖ్యంగా జనసేన నుంచి బయటకు రావడం వంటివి తెరమీదికి వచ్చాయి. ఇప్పటికే ఐదారుగురు కీలక నాయకులు జనసేనకు దూరమయ్యారు. మరోవైపు.. టీడీపీలోనూ జనసేనతో పొత్తు అన్నాక.. నిశ్శబ్ధ వాతావరణం ఏర్పడింది. దీంతో ఎన్నికలకు ముందు ఏర్పడిన ఈ పరిణామాలను సర్ది చెప్పేందుకు పవన్, చంద్రబాబు ప్రయత్నించారు.
అయితే.. ఈ చర్యలు కొనసాగుతున్న సమయంలోనే మరింత మంది దూకుడు నిర్ణయాలు తీసుకుంటుండడంతో పవన్ నేరుగా రంగంలొకి దిగకపోతే.. మరింతగా ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి టీడీపీ-జనసేన ఐక్యతా సమరం అడుగు పడినా.. ఇది పుంజుకోవాలంటే.. క్షేత్రస్థాయిలో పవన్ ఇంకా చర్యలు చేపట్టాల్సి ఉందని, నాయకులను తనవైపు తిప్పుకోవాల్సిన అసవరం ఉందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.