కమ్యూనిస్టులకు కేసీఆర్ తత్వం బోధపడినట్టేనా?
కేసీఆర్ వాడకం ఆ స్థాయిలో ఉంటుందని తెలియని కమ్యూనిస్టులు కూడా ప్రస్తుతం ఆయన ఉచ్చులో చిక్కుకున్నారు
గతంలో కేసీఆర్ చెప్పిందే.. 'తెలంగాణ సాధన కోసం బొంత పురుగునైనా కావలించుకుంటా' అని. అలాగే తన అవసరం కోసం ఎవరినైనా ఆయన తన దగ్గరకు చేర్చుకుంటారు. అంతే త్వరగా వారికి ఝులక్ కూడా ఇస్తారని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. ఇందుకు నిదర్శనం... గతంలో విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని, ఆలే నరేంద్ర పార్టీని టీఆర్‌ఎస్ లో విలీనం చేయించి తన పార్టీకి పోటీగా మరో పార్టీ లేకుండా కేసీఆర్ చేసుకున్నారు. ఆ తర్వాత వారిని పొమ్మనకుండానే పొగబెట్టేశారు. ఇక ప్రొఫెసర్ కోదండరాం పరిస్థితి ఏమిటో అందరూ చూస్తున్నదే.
కేసీఆర్ వాడకం ఆ స్థాయిలో ఉంటుందని తెలియని కమ్యూనిస్టులు కూడా ప్రస్తుతం ఆయన ఉచ్చులో చిక్కుకున్నారు. మునుగోడులో అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్ ఉభయ కమ్యూనిస్టు పార్టీలను చేరదీశారు. మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ ఉండటంతో వారి ఓట్లను కొల్లగొట్టడానికి వారిపై ఎక్కడ లేని ప్రేమను కురిపించారు. వారిని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ కమ్యూనిస్టు పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతామన్నారు.
కేసీఆర్ ను నమ్మిన కమ్యూనిస్టులు కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనతో పొత్తు పెట్టుకుందామని తలచారు. ఇలా అయినా కొన్ని అసెంబ్లీ సీట్లను డిమాండ్ చేయొచ్చని.. పొత్తులో గెలిచి అసెంబ్లీలో కొలువు దీరొచ్చని ఆశించారు. అయితే తాజాగా కేసీఆర్ వచ్చే ఎన్నికల కోసం 115 స్థానాలకు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా నాలుగు స్థానాలను పెండింగ్ లో పెట్టారు. పోనీ ఈ నాలుగు స్థానాలేవీ కమ్యూనిస్టులకు పట్టు ఉన్నవి కూడా కాదు.
అలాగే టికెట్ల ప్రకటన సందర్భంగా కమ్యూనిస్టుల పొత్తు గురించి కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. వారిని అసలు పట్టించుకోలేదు. మరోవైపు ఎంఐఎం పార్టీని మాత్రం మిత్రపక్షంగా అభివర్ణించారు. ఎందుకంటే తెలంగాణలో ముస్లింలు బలంగా ఉన్న చోట ఎంఐఎం పోటీ చేస్తే బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఓట్లకు భారీగా గండిపడుతుంది. ఆ మేరకు బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎంఐఎం అవసరం కాబట్టి కేసీఆర్ తెలివిగా ఆ పార్టీని మిత్రపక్షంగా ప్రకటించారు. స్నేహపూర్వకంగానే తాము పోటీ చేస్తున్నామని చెప్పారు.
కేసీఆర్ తమకు సీట్లు కేటాయిస్తారని.. భద్రాచలం, కొత్తగూడెం, పాలేరు, వైరాలతోపాటు మరికొన్ని సీట్లను కోరాలని కమ్యూనిస్టు పార్టీలు భావించాయి. కనీసం చెరో నాలుగు స్థానాల్లో పోటీ చేయాలని సీపీఐ, సీపీఎం తలచాయి. కానీ కేసీఆర్ ఇచ్చిన షాక్ తో ఆ రెండు పార్టీలకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.
దీంతో సీపీఐ, సీపీఎం రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయించాయి. కేసీఆర్ తమను వదిలేయడంతో కాంగ్రెస్ పార్టీతో కలసి నడవాలని భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమకు శత్రువేం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాజాగా చెప్పడం ఇందుకు నిదర్శనం. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సమావేశమై వచ్చే ఎన్నికల్లో పొత్తుపై నిర్ణయం తీసుకుంటాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీల నడక ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.