ఎమ్మెల్యే చేసినా పేదరికమే ఆమె చుట్టూ...!

ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబాటుతనానికి గురి అయిన శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే. ఆమె అర్ధ శతాబ్దం క్రితం అంటే 1972 నుంచి 1978 దాకా పాతపట్నం ఎమ్మెల్యేగా పనిచేశారు

Update: 2024-03-03 15:30 GMT

ఆమె సామన్యురాలు కాదు, లక్షలలో ఒకరికి దక్కే అదృష్టం ఆమెకు దక్కింది. ఆమె లక్షలాది మందికి ప్రతినిధిగా ఒకనాడు అత్యున్నత చట్ట సభలకు ఎన్నిక అయింది. గిర్రున యాభై ఏళ్లు తిరిగేసరికి ఆమె ఇపుడు ఎలా ఉంది అంటే ఆశ్చర్యమే. ఆమె దైన్య స్థితిని చూసిన వారు అంతా ఎమ్మెల్యేగా చేసినా చివరికి ఇంతేనా అని నిట్టూర్పులు విడుస్తున్నారు.

ఇంతకీ ఆమె ఎవరంటే ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబాటుతనానికి గురి అయిన శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే. ఆమె అర్ధ శతాబ్దం క్రితం అంటే 1972 నుంచి 1978 దాకా పాతపట్నం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె పేరు సుక్కా పగడాలమ్మ. ఆమె శ్రీకాకుళం జిల్లా ముక్తాపురం గ్రామానికి చెందిన వారు.

ఆమె ఎమ్మెల్యే నాడు చేసినా నేడు పేదరికమే ఆమె చుట్టూ ఉంది. ఎమ్మెల్యే అంటే మామూలు పదవి కాదు, ఆ ఉన్నత పదవిని అందుకున్న వారు కనీసం కూడు గుడ్డకు లోటు లేకుండా ఉంటారు. కానీ పగడాలమ్మ పరిస్థితి అందుకు భిన్నం. ఆమెకు మాజీ ఎమ్మెల్యేగా ప్రభుత్వం అందిస్తున్నది నెలకు ముప్పయి వేల రూపాయలు.

అదే ఆమె జీవితానికి ఆధారం. ఈ రోజూలో ముప్పయి వేలు అంటే ఏమంత పెద్ద మొత్తం కాదు, దానితోనే ఆమె నెల జీవితం గడవాలి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే అయితే రాజ భవనాలను కట్టుకునే వారినే అంతా చూశారు. కానీ పగడాలమ్మకు మాత్రం తాను ఉన్న ఇల్లు కూలిపోయే స్థితిలో ఉంది. బిక్కుబిక్కుమంటూ అందులోనే ఆమె కాలక్షేపం చేస్తున్నారు.

ఇక ఆమె తన కూతుళ్ల పెళ్ళిళ్ల కోసం అప్పులు చేసి మరింత ఆర్ధిక ఇబ్బందులలో పడ్డారు. పైగా వయోభారంతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. దాంతో ఆమె తన అనారోగ్య సమస్యలకు కూడా పెన్షన్ డబ్బులు సరిపోవడం లేదని వాపోతున్నారు. తన ఇంటి మరమ్మతులకు అయినా ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయాన్ని ఆమె ఆశిస్తున్నారు.

నిజంగా ఇది విషాదమే. పగడాలమ్మ లాంటి వారు అరుదుగా ఉంటారు. ఎమ్మెల్యే చేసినా ఏమీ తనకు కూడా సంపాదించుకోలేని ఆమె ఎందరికో స్పూర్తి. ఈ రోజులలో అతి చిన్న పదవిలో కూడా ఉంటూ కోట్లకు పడగలెత్తేస్తున్నారు.

అలాంటి చోట తులసి మొక్కలా పగడాలమ్మ ఉన్నారు. పేదలకు ఇళ్ళు ఇస్తూ వారిని ఒక ఇంటి వారు చేస్తున్న ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే విషయంలో కనీసమైన శ్రద్ధ తీసుకోవాలని అంతా కోరుతున్నారు. అలాగే ఆమె అనాగోగ్య సమస్యలకు ఏదైనా ఆర్ధిక ఆసరా ఇవ్వాలని ఆమెను ఆదుకోవాలని కూడా కోరుతున్నారు.

ఈ రోజులలో రాజకీయం పూర్తిగా వ్యాపారం అయిపోయింది. ఎంత తెస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు ఈ రాజకీయ గణిత శాస్త్రాన్నే అంతా వంటబట్టించుకుంటున్నారు. ఈ రోజున చూస్తే పగడాలమ్మ లాంటి వారు ఎక్కడా బూతద్ధంతో వెతికినా కనిపించరు. కనీసం ఆమెను ఆదుకుని అయినా ఎంతో కొంత అండగా ఉండాలని అంతా కోరుతున్నారు.

Tags:    

Similar News