మీడియా అధినేత ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్

Update: 2023-08-02 04:34 GMT

ఉద్యమ నేతగా ఉన్నప్పుడు.. రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రముఖులు.. ‘పవర్ ’ఫుల్ వ్యక్తులను కలిసే విషయంలో నేతలకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అందుకు బీఆర్ఎస్ అధినేత.. గులాబీ బాస్ కేసీఆర్ లాంటి వారు సైతం మినహాయింపు కాదు. కానీ.. రాజకీయాల్లో ఒకసారి పవర్ లోకి వస్తే.. లెక్కలు మారిపోతాయి. ఆ విషయంలో గులాబీ బాస్ వైఖరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాల్టి రోజున ఆయన వద్దకు ఎవరైనా రావాలే కానీ.. ఆయన ప్రత్యేకంగా ఎవరి వద్దకు వెళ్లే పరిస్థితి లేదు.

ఆ మాటకు వస్తే.. ముఖ్యమంత్రిగా అధికారాన్ని మొదటిసారి చేపట్టిన వేళలో.. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రముఖ మీడియా సంస్థగా చెప్పుకునే మీడియా సంస్థకు చెందిన ముఖ్యుడు.. సీఎం కేసీఆర్ ను కలిసి అభినందలు తెలిపేందుకు వెళ్లారు. నిజానికి సదరు మీడియా సంస్థ చరిత్రలో అలా ఒక సీఎం వద్దకు వెళ్లింది లేదు. కానీ.. కొత్త రాష్ట్రానికి సీఎంగా అయిన కేసీఆర్ ను కలిసేందుకు వెళ్లినట్లు చెబుతారు. అలాంటి ఆ పెద్ద మనిషిని ఏకంగా 45 నిమిషాల పాటు వెయిట్ చేయించిన ఘనత కేసీఆర్ దని చెబుతారు. ఇదంతా ఎందుకంటే.. అధికారం చేతిలో లేనప్పుడు సదరు మీడియా సంస్థ అధినేతను కలిసేందుకు పలుమార్లు వెళ్లిన కేసీఆర్.. తాను పవర్లోకి వచ్చిన తర్వాత అదే మీడియా సంస్థకు చెందిన ముఖ్య ప్రతినిధిని అంతసేపు వెయిట్ చేయించటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదంతా ఎందుకంటే.. అదేదో సినిమాలో చెప్పినట్లుగా కేసీఆర్ తో అట్లుంటది మరి. అవసరానికి తగ్గట్లు తగ్గటం.. అదే సమయంలో అధికార దర్పాన్ని ప్రదర్శించటం ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. ఇటీవల మహారాష్ట్ర మీద గురి పెట్టిన ఆయన.. అక్కడకు తరచూ వెళుతూ.. అక్కడి ప్రముఖుల్ని కలుస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన వారికి పెద్ద పీట వేస్తూ.. ప్రగతిభవన్ లో వారికి మర్యాదలు ఒక రేంజ్ లో సాగుతున్నాయి. తాజాగా మరోసారి మహారాష్ట్రకు వెళ్లిన ఆయన.. అక్కడ పలు కార్యక్రమాల్ని పాల్గొన్నారు.

ఇదే సమయంలో కొల్హాపూర్ లో ప్రముఖ మరాఠి దినపత్రిక ‘పుధారి’ అధినేత ప్రకాశ్ సింగ్ జాదవ్ పిలిచారన్న పేరుతో ఆయన ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లి అతిథ్యం స్వీకరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరినైనా తన వద్దకు వచ్చేలా చేసుకునే కేసీఆర్.. అవసరానికి అనుగుణంగా తనను తాను మార్చుకోవటంలో దిట్ట. అందుకు తాజా మహారాష్ట్ర పర్యటనే నిదర్శనంగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News