బిగ్ ఇష్యూ... ఆ విషయంలో జగన్ ను ఫాలో అవుతున్న కాంగ్రెస్!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ ముఖ్యమంత్రిగా మరో 11 మంది కీలక నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ ముఖ్యమంత్రిగా మరో 11 మంది కీలక నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణలో 18 మంది మంత్రులు ఉండే అవకాశం ఉండటంతో మిగిలిన ఆరుగురు ఎవరు అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో 64 మంది ఎమ్మెల్యేలలోనూ సీఎం మినహా మిగిలిన వారిలో కేవలం 17 మందికే మంత్రి పదవులా.. మిగిలిన వారి పరిస్థితి అనే చర్చ అప్పుడే పలువురు సీనియర్ల అనుచరుల్లో మొదలైందని అంటున్నారు.
ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దమైంది. ఈ జాబితాలో భట్టి విక్రమార్క, ఉత్తం కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణ రావు, తుమ్మల నాగేశ్వరరావులు ఉన్నారు.
ఇక మిగిలిన ఆరుగురు మంత్రుల ఎంపిక రెండు రోజుల్లో పూర్తి కానుందని తెలుస్తుంది. ఈ సమయంలో ఆ ఆరుగురి లిస్ట్ లో కూడా లేకుండా మంత్రి పదవులు రాని వారికి హైకమాండ్ నుంచి తాజాగా సరికొత్త సంకేతాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఇవి ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్నాయి. దీంతో పలువురి ఆశావహులు కాస్త కూల్ అవుతున్నట్లు తెలుస్తుంది.
వాస్తవానికి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ముందు భారీ లక్ష్యాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా గ్యారంటీల అమలు కీలకంగా ఉంది. వచ్చే ఏడాది మొదట్లో లోక్ సభ ఎన్నికలు ఉండటంతో వీటి అమలు కీలకంగా మారింది. అయితే అందుకు అవసరమైన ఆర్థికక పరిస్థితులు ఇప్పుడు సరికొత్త టెన్షన్ గా మారాయని అంటున్నారు. అందువల్లే మంత్రుల్లో సీనియర్లకు అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఈ సమయంలో ప్రస్తుతం ఎంపిక చేసిన మంత్రులకు రెండున్నరేళ్లు డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తుంది. సరిగ్గా ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏమి చేసిందో.. అదే సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అనుసరించబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో కొందరు సీనియర్లను, బెస్ట్ పెర్ఫార్మర్స్ ను కొనసాగిస్తున్న వారినీ కంటిన్యూ చేస్తూ.. రెండున్నరేళ్ల తర్వాత కొత్త వారికి కూడా అవకాశం కల్పించనున్నారని తెలుస్తుంది.
దీంతో మంత్రి పదవులు దక్కని కొంతమంది సీనియర్లు, కీలక నేతల్లో అసంతృప్తులు తెరపైకి రాకుండా చక్కదిద్దడంతోపాటు.. ముందు ముందు సరికొత్త ఇబ్బందులు రాకుండా ఇలా ప్లాన్ చేశారని చెబుతున్నారు. ఏది ఏమైనా... ఇప్పుడు ఈ ఇష్యూ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు!