కాంగ్రెస్ మీద ఏపీ జనాలకు కోపం తగ్గుతోందా...?
అలా ఆంధ్రులు తమ మంటను కాంగ్రెస్ మీద చూపించి ఏపీలో ఆ పార్టీని ఉనికిలో లేకుండా చేశారు. 2019లో కూడా అదే పరిస్థితి.
కాంగ్రెస్ పార్టీ 2014లో కేంద్రంలో యూపీయేకు నాయకత్వం వహిస్తూ ఉమ్మడి ఏపీని రెండుగా విభజించి అడ్డగోలు నిర్ణయం తీసుకుందని ఆగ్రహించింది ఆంధ్రా లోకం. ఫలితంగా కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న ఏపీలో ఆ పార్టీకి ఫస్ట్ టైం డిపాజిట్లు పోయాయి. కాంగ్రెస్ తరఫున ఉద్ధండులు పోటీ చేస్తే అందరికీ డిపాజిట్లే రాకుండా పోయాయి.
అలా ఆంధ్రులు తమ మంటను కాంగ్రెస్ మీద చూపించి ఏపీలో ఆ పార్టీని ఉనికిలో లేకుండా చేశారు. 2019లో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ కి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చేలా చేశారు. ఇపుడు చూస్తే మళ్లీ ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. 2024 ఎన్నికలు అంటే ఎక్కువ దూరం లేదు.
మరి ఈసారి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అంటే కాంగ్రెస్ నేతలు మాత్రం కొంత ఆశావహంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. దానికి కారణం తెలంగాణాలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం. ఈసారి తెలంగాణాలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకుని రావాలని తెలంగాణా సమాజంతో పాటు ఆంధ్రా నుంచి వెళ్ళిన వారూ భావిస్తున్నారు అని సర్వేలు చెబుతున్నాయి.
ఈ సర్వే ఫలితాలే నిజం అయితే మాత్రం కచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ దశ తిరిగినట్లే. ఎందుకంటే తెలంగాణాలో బీజేపీ కూడా పోటీ చేస్తోంది. కానీ బీజేపీ గ్రాఫ్ అక్కడ డౌన్ అవుతోంది అని సర్వేలు చెబుతున్నాయి. ఏపీలో చూస్తే 2019 ఎన్నికల్లో బీజేపీ నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుంది.
అయితే కాంగ్రెస్ పొరుగున ఎత్తిగిల్లుతోంది. కర్నాటకలో జెండా ఎగిరింది. బీజేపీ తీరు చూస్తే కర్నాటకలో అధికారంలో నుంచి దిగిపోయింది. తెలంగాణాలో కూడా గెలుపు ఆశలు అయితే కనిపించడంలేదు. ఈ నేపధ్యంలో బీజేపీకి ఏపీలో ఆశలు అయితే 2024లో పెద్దగా ఉండబోవు అని అంటున్నారు. పొత్తులతో అయితే బీజేపీకి ఏమైనా చాన్స్ ఉండవచ్చేమో అన్న మాట ఉంది.
ఇంకో వైపు చూస్తే తెలంగాణాలో కాంగ్రెస్ కి టీడీపీ మద్దతు ఇవ్వడం కూడా విస్మయం కలిగిస్తోంది. నిజానికి అయితే ఇది అంతగా ఆశ్చర్యపోయే విషయం కాదు. 2018 ఎన్నికల్లోనే టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని నేరుగా పోటీ చేసింది. అయితే ఏపీలో తరువాత ఎన్నికల్లో టీడీపీ ఓడింది. దాంతో కాంగ్రెస్ తో పొత్తు ప్రభావం కూడా ఎంతో కొంత ఉందని అనుకున్నారు.
ఇపుడు కాంగ్రెస్ కి ఓటు వేయాలని తెలుగుదేశం జెండాలతో అక్కడ ఆ పార్టీ వారు బాహాటంగా తిరుగుతున్నారు. అధినాయకత్వం అయితే ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ కి మద్దతు అని కూడా చెప్పలేదు. కానీ గ్రౌండ్ లోకి దిగితే జరుగుతున్నది అదే. దీంతో కాంగ్రెస్ కి వస్తున్న పాజిటివిటీ టీడీపీకి ప్లస్ అవుతుందా అన్నది కూడా మరో చర్చగా ఉంది.
ఇక డిసెంబర్ 3న తెలంగాణాతో పాటు దేశం మొత్తం అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. తెలంగాణాలో కనుక కాంగ్రెస్ గెలిస్తే కచ్చితంగా ఏపీలోనూ ఆ ప్రభావం ఉంటుంది అని అంటున్నారు. 2024 మాత్రం కాంగ్రెస్ కి కచ్చితంగా 2014 దాకా ఉండదని కూడా అంటున్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో డౌన్ అయితే మాత్రం టీడీపీ టైం చూసి కాంగ్రెస్ తో చేతులు కలిపినా కలపవచ్చు. దానికి లిట్మస్ టెస్ట్ గా తెలంగాణాలో టీడీపీ మద్దతు వల్ల కాంగ్రెస్ గెలిచింది అని చూపించుకోవచ్చు.
జనాలు కూడా ఆగ్రహించడంలేదు అని చెప్పుకోవచ్చు. నిజానికి అదే జరుగుతోంది అని కూడా అంటున్నారు. టోటల్ గా చూస్తే మాత్రం పదేళ్ళ సుదీర్ఘ కాలం తరువాత ఏపీ జనాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా అన్నది మాత్రం ఒక కొత్త చర్చగానే ఉంది. అదే జరిగితే ఏపీలో అధికార వైసీపీకి వచ్చే నష్టం ఎంతవరకూ అన్నది రెండవ ప్రశ్న. వీటన్నిటికీ మరి కొద్ది రోజులలోనే జవాబు అయితే దొరుకుతుంది అన్నది మాత్రం వాస్తవం. అంతవరకూ వేచి చూడాల్సి ఉంది.